వివరాలు ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టుకు ఆదేశం
న్యూఢిల్లీ : విహెచ్‌పి కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక అందచేయాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. ఈ నెల 8న విహెచ్‌పి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ యాదవ్ ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) సమర్థిస్తూ వ్యాఖ్యానించడంతో పాటు పరోక్షంగా ముస్లింలపై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ‘మన పిల్లలకు పుట్టినప్పటి నుంచి దయ, సహనం అలవాటు చేస్తాం. వాళ్లు పిల్లల ముందే జంతువులను వధిస్తారు. అలాంటప్పుడు వారికి దయ, సహనం ఎలా అలవడతాయని’ అంటూ ఆయన పేర్కొన్నారు. ఇది హిందూదేశమని, మెజారిటీ ప్రజలు అనుకున్నట్టుగానే భారత్ నడుస్తుందని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.