- శరద్ పవార్ విమర్శలు
ముంబయి : కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనపై చేసిన ఆరోపణలకు ఎన్‌సిపి (ఎస్‌పి) పార్టీ చీఫ్ శరద్‌పవార్ ఘాటుగా ప్రతిస్పందించారు. స్వంత రాష్ట్రం నుంచి అమిత్‌షాను సుప్రీంకోర్టు రెండేళ్లపాటు బహిష్కరించిందని, అలాంటి వ్యక్తి మన హోం మంత్రి అని శరద్ పవార్ విమర్శించారు. శనివారం జరిగిన పార్టీ సమావేశంలో శరద్‌పవార్ మాట్లాడుతూ ‘కొన్నిరోజుల క్రితం హోంమంత్రి అమిత్‌షా నాపై ఆరోపణలు చేశారు. ‘దేశంలోని అవినీతి పరులందరికీ కమాండర్’ అని ఆయన నన్ను పిలిచారు. ఒక కేసులో అమిత్‌షాను గుజరాత్ నుంచి రెండేళ్లపాటు సుప్రీంకోర్టు నిషేధించింది. నాడు సొంత రాష్ట్రం నుంచి కోర్టు నిషేధించిన వ్యక్తి నేడు కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి నుంచి నాకు సర్టిఫికెట్లు అవసరం లేదు. నా గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు.’ అని అన్నారు. దీన్నిబట్టి ‘మనం ఎటువైవపు వెళ్తున్నామో ఆలోచించాలని తెలిపారు. ఈ దేశం ఎవరి చేతుల్లో ఉందో, ప్రజలు తప్పుదారిలో పయనిస్తున్న తీరు మనం ఆలోచించాలి. లేదంటే వారు దేశాన్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్తారని నాకు వందశాతం నమ్మకం ఉంది. మనం దీనిపై దృష్టి పెట్టాలి.’ అని అన్నారు. 2010లో సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించి అమిత్‌షాను సొంత రాష్ట్రం నుంచి రెండేళ్లపాటు సుప్రీంకోర్టు నిషేధించింది. ఈ కేసులో 2014లో నిర్దోషిగా అమిత్ షా విడుదలయ్యారు.