న్యూఢిల్లీ : మణిపూర్ హింసాకాండలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ పాత్ర ఉందని చెబుతున్న ఆడియా రికార్డింగ్‌ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. 2023లో ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జరిగిన సమావేశానికి సంబంధించిన ఈ ఆడియో క్లిప్ ప్రస్తుతం విచారణ కమిషన్ వద్ద ఉంది. ఈ ఆడియోలో బీరేన్ సింగ్ మాటలు రికార్డయి ఉన్నాయి. రెండు నిషేధించిన మెయితీ సంస్థలు భద్రతా సిబ్బంది యూనిఫారతో సంచరించడాన్ని, వారు ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించడాన్ని ముఖ్యమంత్రి సమర్థిస్తున్నట్లుగా ఈ క్లిప్‌లో ఉంది. ఇద్దరు కుకీ మహిళలను నగంగా ఊరేగించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ క్లిప్ విషయాన్ని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ హింసాకాండకు ఆజ్యం పోశారు. ఆయుధాలను దోచుకున్న వారిని రక్షించారు’ అని విన్నవించారు. ఈ ఆడియో క్లిప్‌ను పరిశీలిస్తామని, ఈ క్లిప్ ప్రామాణికతను సూచించే ఆధారాలను కూడా సమర్పించాలని సిజెఐ డివై చంద్రచూడ్, జస్టిస్ పార్దివాలా, జిస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ప్రశాంత్ భూషణ్‌ను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ ఆడియో క్లిప్‌పై తీవ్ర అభ్యంతరం తెలిపినప్పటికీ ఈ టేపులపై దర్యాప్తు చేయాలని ధర్మాసనం నిర్ణయించింది. ‘మణిపూర్‌లో ఏం జరిగిందో మనందరకు తెలుసు. కాబట్టే ఈ ఆడియో క్లిప్‌ను కొట్టిపారేయలేం. దీనిని పరిశీలిస్తాం’ అని సిజెఐ చంద్రచూడ్ ఈ సందర్భంగా తెలిపారు.
