- జస్టిస్ చంద్రచూడ్‌పై ఫిర్యాదును తోసిపుచ్చిన లోక్‌పాల్
న్యూఢిల్లీ : హైకోర్టులు, సబార్డినేట్ కోర్టుల జడ్జీలు తమ పరిధిలోకే వస్తారని, అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వోద్యోగులు కానందున వారికి మినహాయింపు ఉన్నదని లోక్‌పాల్ రూలింగ్ ఇచ్చింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదును తోసిపుచ్చుతూ లోక్‌పాల్ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.జస్టిస్ చంద్రచూడ్ ఒక రాజకీయవేత్తకు, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం కోసం అవినీతికి పాల్పడ్డారని, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ గత అక్టోబర్ 18న లోక్‌పాల్‌కు 382 పేజీల ఫిర్యాదు అందింది. అయితే దీనిని లోక్‌పాల్ తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తన పరిధిలోకి రారని తెలిపింది. సుప్రీంకోర్టు పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడినది కాదని, అది రాజ్యాంగంలోని 124వ అధికరణ కింద ఏర్పడిందని, కాబట్టి దాని న్యాయమూర్తులు ప్రభుత్వోద్యోగుల నిర్వచనం కిందికి రారని లోక్‌పాల్ రూలింగ్ ఇచ్చింది. పైగా సుప్రీంకోర్టుకు పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం లేదని, అంతేకాక దానిని నియంత్రించడం లేదని జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ అధ్యక్షత వహిస్తున్న లోక్‌పాల్ తెలియజేసింది. సుప్రీంకోర్టు వ్యయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి భరిస్తారని, అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపై ఆధారపడదని తెలిపింది. అయితే తన పరిధిలోని హైకోర్టులు, ఇతర న్యాయస్థానాల జడ్జిలకు ఈ రూలింగ్ వర్తించదని లోక్‌పాల్ స్పష్టం చేసింది. అవి పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడినవి కాబట్టి తన పరిధిలో ఉంటాయని తెలిపింది. ఫిర్యాదుదారుడు చట్టం అనుమతించిన పద్ధతుల్లో ఇతర పరిష్కార మార్గాలు అన్వేషించుకోవచ్చునని, ఫిర్యాదులోని ఆరోపణలపై తాము స్పందించబోమని లోక్‌పాల్ తెలియజేసింది.