- న్యాయవాదుల్లో ఆందోళన
న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణపతి పూజకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. మోడీకి ప్రధాన న్యాయమూర్తి, ఆయన భార్య కల్పనాదాస్ స్వాగతం పలికారు. గణపతి పూజ కోసం డివై చంద్రచూడ్ నివాసానికి ప్రధానమంత్రి రావడంపై శివసేన (యుబిటి) నాయకులు, సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకతపై ప్రభావం చూపుతుందని అన్నారు. రాజకీయ నాయకులను ”రాజ్యాంగ పరిరక్షకుడు” కలవడం ప్రజల మనస్సులలో సందేహాలను రేకెత్తిస్తుందని శివసేన ఎంపి సంజరు రౌత్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఏక్‌నాథ్ షిండే నేతత్వంలోని వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించాలన్న మహారాష్ట్ర స్పీకర్ నిర్ణయాన్ని ఉద్ధవ్ ఠాక్రే శిబిరం సవాలు చేసిన కేసు సీజేఐ చంద్రచూడ్ ముందు విచారణ జరుగుతోంది. ఈ కేసులో ప్రధానమంత్రి ఇతర పక్షంగా ఉన్నందున తమకు న్యాయం జరుగుతుందా? అన్న సందేహం కలుగుతోంది. ఈ కేసు విచారణ నుంచి దూరంగా ఉండాలని చంద్రచూడ్‌కు రౌత్ సూచించారు. శివసేన (యుబిటి) ఎంపి ప్రియాంక చతుర్వేది కూడా న్యాయవ్యవస్థపై విరుచుకుపడ్డారు.