Supreme Court : భారతదేశంలో ఏ భాగాన్ని పాకిస్తాన్‌ అని పిలవలేం

న్యూఢిల్లీ : భారతదేశంలో ఏ భాగాన్నీ పాకిస్తాన్‌ అని పిలవలేమని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. ఇటీవల కోర్టు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి వేదవ్యాసాచార్‌ శ్రీశానంద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే తాను చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన జస్టిస్‌ శ్రీశానంద్‌పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. న్యాయవ్యవస్థ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకున్ని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ తెలిపారు.
కాగా, ‘బెంగళూరులో ముస్లింలు మెజారీటీగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్‌’ అని శ్రీశానంద్‌ వ్యాఖ్యానించారు. ఇక మరో విచారణలో మహిళా న్యాయమూర్తిపై స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలలో కనిపించిన న్యాయమూర్తి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. దీనిపై కర్ణాటక హైకోర్టు నుంచి నివేదికను కోరింది. శ్రీశానంద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్వయంగా కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు… దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలివ్వాలని సిజెఐ చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ ఎస్‌ ఖన్నా, బి ఆర్‌ గవారు, ఎస్‌ కాంత్‌, హెచ్‌ రాయల్‌తో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సెప్టెంబర్‌ 20న నొక్కి చెప్పింది.
కాగా, బుధవారం చేపట్టిన విచారణ సందర్భంగా… కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అన్న వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత భూభాగంలోని ఏ భాగాన్నీ ఎవరూ పాకిస్తాన్‌ అని పిలవలేరు అని చంద్రచూడ్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రాథమికంగా దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధం. ‘సూర్యరశ్మికి సమాధానం.. ఎక్కువ సూర్యకాంతి అని కాదు. కోర్టులో జరిగే వాటిని అణచివేయడానికో.. లేదా మూసివేయమో దానికి సమాధానం కాదు’ అని ఆయన అన్నారు.
సాధారణ పరిశీలన అనేది ఒక నిర్దిష్ట లింగం లేదా సంఘంపై నిర్దేశించబడినప్పుడు వ్యక్తిగత పక్షపాతాలను సూచించవచ్చు. అందువల్ల పితృస్వామ్య లేదా స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మేము నిర్దిష్ట లింగం లేదా సంఘంపై పరిశీలనల గురించి తీవ్రమైన ఆందోళనను వ్యక్తం చేస్తున్నాము. అలాంటి పరిశీలనలు ప్రతికూలతను సృష్టిస్తాయి. ఇలాంటి వ్యాఖ్యలపై పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాము అని చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. కోర్టు కార్యకలాపాలను పర్యవేక్షించడంలో సోషల్‌మీడియా చురుకైన పాత్ర పోషిస్తోంది. అలాంటప్పుడు న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఇబ్బందులకు గురిచేయకూడదని, వాటిని గమనించుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

➡️