ప్రబీర్‌ అరెస్టు చెల్లదు

May 16,2024 00:35 #NewsClick, #orders, #supreemcourt
  •  తక్షణమే విడుదల జేయండి
  • సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు
  • రాత్రి 9.30 గంటలకు జైలు నుంచి బయటకు వచ్చిన న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌

ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో : న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు, రచయిత ప్రబీర్‌ పుర్కాయస్థ అరెస్టు చెల్లదని, ఆయనను బెయిలుపై తక్షణమే విడుదలజేయాలని సుప్రీం కోర్టు బుధవారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది.కోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రబీర్‌ పుర్కాయస్త జైలు నుంచి విడుదలయ్యారు.
ప్రశ్నించేవారిపై దేశ ద్రోహ నేరం వంటి తప్పుడు కేసులు బనాయించి స్వతంత్ర మీడియా పీకనులిమేస్తున్న నిరంకుశ మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇది. 2023 ఆగస్టులో ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ప్రచురించిన ఓ కట్టు కథ ఆధారంగా అదే సంవత్సరం అక్టోబరు3న ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. భారత దేశాన్ని దెబ్బ తీసేందుకు విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యారని ప్రబీర్‌పైన, న్యూస్‌క్లిక్‌పైన వారు అభియోగాలు మోపారు.
న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడి అరెస్టు విషయంలో ఢిల్లీ పోలీసులు కనీస ప్రాథమిక నియమాలు కూడా పాటించకుండా ఎందుకంత తొందరపాటుతో వ్యవహరించారని జస్టిస్‌ బిఆర్‌ గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఇది సహజ న్యాయసూత్రాలను, కోర్టు మునుపటి ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. 2023 అక్టోబరు4వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రబీర్‌పై రిమాండ్‌ ఆర్డర్‌ జారీ చేసిన కొన్ని గంటల తరువాత ప్రబీర్‌ లాయర్‌కు రిమాండ్‌ దరఖాస్తు ప్రతిని ఇచ్చారని కోర్టు పేర్కొంది. అక్టోబరు3న వందలాది మంది అధికారులు న్యూఢిల్లీలోని దాదాపు 100 ప్రదేశాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించారు. అసాధారణమైన రీతిలో మూకుమ్మడి దాడులు నిర్వహించి, డజన్ల కొద్దీ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఇతర వస్తువులను తీసుకెళ్లారు. న్యూస్‌క్లిక్‌లో ప్రస్తుతం, గతంలో పనిచేసిన ఉద్యోగులను గంటల తరబడి విచారించారు.
ప్రబీర్‌ అరెస్టు చట్ట విరుద్ధమని తీర్పు ఇచ్చిన కోర్టు ఆయనను బెయిలుపై విడుదల చేయాలని ఆదేశించింది. ” మేము ఆయనను ష్యూరిటీ లేకుండా విడుదల చేయవచ్చు. కానీ, చార్జిషీట్‌ దాఖలైనందున ష్యూరిటీ , బెయిలు బాండ్‌తో విదుడల జేస్తున్నాం అని కోర్టు పేర్కొంది. ఈ కేసులో విచారణను ఏప్రిల్‌30తో ముగించిన సుప్రీం కోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచి బుధవారం ప్రకటించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ట్రయల్‌ కోర్టు కొన్ని షరతులతో బెయిలు మంజూరు చేసింది. అనేక అరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రబీర్‌ ఏడు నెలలుగా అకారణంగా జైలులో మగ్గారు. ఆయన కస్టడీని పదే పదే పొడిగింపును కోరిన ఢిల్లీ పోలీసులు చివరకు క్రూరమైన ఉగ్రవాద వ్యతిరేక చట్ట విరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అభియోగాలు మోపుతూ 8,000 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. న్యూస్‌ క్లిక్‌ ఈ ఛార్జిషీట్‌ను నిరాధారమైనది, కుట్రపూరితమైనదని తోసిపుచ్చింది.
ప్రబీర్‌ అరెస్టును భారత దేశంలోను, ప్రపంచ వ్యాపితంగా ఉన్న ప్రగతి శీల శక్తులు ఖండించాయి. బిజెపి నేతృత్వంలోని మితవాద ప్రభుత్వం మీడియా స్వేచ్ఛపై దాడిగా పేర్కొంటూ ప్రబీర్‌ను వెంటనే విడుదలజేయాలని డిమాండ్‌ చేశాయి.
ప్రగతిశీల, స్వతంత్ర వెబ్‌ పోర్టల్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు జరిపిస్తూ వేధిస్తున్న తరుణంలో న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఎటువంటి ఆధారాలు లేకుండా న్యూస్‌క్లిక్‌పై ఓ కట్టు కథను ప్రచురించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ ద్వారా నిధులు అందుకుంటున్న చైనా అనుకూల ప్రచార యంత్రాంగంలో న్యూస్‌క్లిక్‌ భాగస్వామిగా ఉందని ఆరోపించింది. ఈ ఆరోపణలను న్యూస్‌క్లిక్‌, ఇతర సంస్థలు, వ్యక్తులు వెంటనే ఖండించాయి. తమ ప్రతిష్టను దెబ్బతీయాలన్న దుర్బుద్ధితోను, రాజ్యం హింసించేందుకు అవసరమైన ప్రాతిపదికను సమకూర్చే ఉద్దేశంతోనే ఈ కట్టుకథను అల్లారని వారు పేర్కొన్నారు. భారత్‌లో న్యూయార్క్‌ టైమ్స్‌ కథనాన్ని ఉటంకిస్తూ న్యూస్‌క్లిక్‌పైన, ప్రబీర్‌ పైన, ఇతర సభ్యులపైన కార్పొరేట్‌ మీడియా, బిజెపి ప్రభుత్వంలో పెద్దలు ఉన్మాదపూరితంగా దాడి చేశారు. ఆ కథనం ప్రచురించబడిన రెండు నెలలకు ఢిల్లీ పోలీసులు ఉపా చట్టం కింద కేసు బనాయించి, అరెస్టు చేశారు.
స్వతంత్ర మీడియాకు ఇదొక మంచి రోజు అని కోర్టు తీర్పును స్వాగతిస్తూ ప్రగతిశీల సంఘాలు అభివర్ణించాయి. ప్రబీర్‌ విడుదల దేశంలోని స్వేచ్ఛా స్వతంత్ర మీడియాకు ప్రోత్సాహం అని నొక్కి చెప్పాయి.
కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస ఐజాక్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెడుతూ, ఈ తీర్పు ఢిల్లీ పోలీసుల ఏకపో వైఖరిని, ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో చట్టన్ని ఎలా తుంగలో తొక్కిందీ బట్ట బయలు చేసిందని పేర్కొన్నారు.

చాలా సంతోషంగా ఉంది : ప్రబీర్‌ అన్న మాటలివి
”నా అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నుంచి వ్యక్తమైన సంఘీభావం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేశాను. ఇక ముందు కూడా నా పోరాటం కొనసాగుతుంది.”

➡️