పతంజలి కేసులో నిర్ణయాన్ని రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు

May 14,2024 23:57 #judgement, #supreem court

న్యూఢిల్లీ : ప్రజలను తప్పుదారి పట్టించేలా వాణిజ్య ప్రకటనలు జారీ చేస్తున్న కేసులో యోగా గురు రామ్‌దేవ్‌, ఆయన సహాయకుడు బాలకృష్ణ, పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పును రిజర్వ్‌ చేసుకుంది. లైసెన్సులు రద్దు చేయబడిన పతంజలి ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్‌ను రీకాల్‌ చేయడానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని పతంజలి తరపు న్యాయవాది కోర్టును కోరారు. మూడు వారాల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం బెంచ్‌ ఆదేశించింది. వారికి కోర్టు ధిక్కార నోటీసులను జారీ చేయడంపై ఆదేశాలను రిజర్వ్‌ చేసుకున్నామని జస్టిస్‌ హిమా కొహ్లి, జస్టిస్‌ అసనుద్దీన్‌ అమనుల్లాలతో కూడిన బెంచ్‌ తెలిపింది. విచారణ సందర్భంగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) అధ్యక్షుడు ఆర్‌.వి.అశోకన్‌ బెంచ్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఇటీవల పిటిఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆశోకన్‌, సుప్రీంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో అశోకన్‌ క్షమాపణ చెబుతూ ఇచ్చే అఫిడవిట్‌ను ఆమోదించలేమని బెంచ్‌, ఐఎంఎల్‌ తరపు న్యాయవాదికి తెలిపింది. అశోకన్‌ తీవ్రమైన, ఆమోదయోగ్యం కాని ప్రకటనలు చేశారని బెంచ్‌ వ్యాఖ్యానించింది.

➡️