Supreme Court : మైనారిటీ సంస్థల చట్టాలు లౌకికవాదాన్ని ఉల్లంఘించలేవు

న్యూఢిల్లీ :   మైనారిటీ సంస్థలను నియంత్రించే చట్టాలు లౌకికవాదాన్ని ఉల్లంఘించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌ బోర్డ్‌ ఆఫ్‌ మదర్సా ఎడ్యుకేషన్‌ యాక్ట్‌, 2004ను కొట్టివేస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సిజెఐ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. నిర్దిష్టమైన కమ్యూనిటీకి చెందిన సంస్థను నియంత్రించే చట్టాల ప్రభావం లౌకికవాదం సిద్దాంతాలను ఉల్లంఘించలేవని సిజెఐ పేర్కొన్నారు.

ఈ తీర్పుని సవాలు చేస్తూ పిటిషన్‌దారులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా ఉన్న 16,000 మదర్సాలలోని సుమారు 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని మదర్సాల తరపున పిటిషన్‌దారులు పేర్కొన్నారు.

ఇదే సమయంలో సిజెఐ మహారాష్ట్ర నుండి తమిళనాడు వరకు అన్ని రాష్ట్రాల్లో ఉన్న హిందూ రిలిజియస్‌ ఎండోమెంట్స్‌ అండ్‌ చారిటబుల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ యాక్ట్‌ (మతపరమైన సంస్థను నియంత్రించే చట్టం) చట్టాన్ని కూడా ప్రస్తావించారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే మైనారిటీ సంస్థను మరింత మెరుగుపరిచేందుకు చట్టం చేసే హక్కు రాష్ట్రానికి ఉందని పేర్కొన్నారు.
”ఇది రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశం. మదర్సాల నుండి వచ్చే వారు చిన్న పిల్లలు. వారికి విస్తృతమైన విద్య అవసరం. సముచితమైన జీవితాన్ని గడిపేందుకు అత్యవసరమైన అన్ని సబ్జెక్టులను నేర్చుకోవాల్సి వుంది. అప్పుడే వారు యోగ్యులైన పౌరులుగా మారతారు” అని సిజెఐ పేర్కొన్నారు.

ఆర్టికల్‌ 30 మైనారిటీలు తమ మత బోధనకు పూర్తిగా పరిమితం కాకుండా వారి సంస్థలను స్థాపించడానికి, నిర్వహించడానికి వీలు కల్పించిందని ప్రధాన న్యాయమూర్తి ఎత్తిచూపారు. బుద్ధిజానికి చెందిన సంస్థలు మెడిసిన్‌ లేదా ఇంజనీరింగ్‌ బోధించవచ్చు. కేవలం బుద్దిజానికి సంబంధించిన అంశాలను మాత్రమే బోధించాలనే ఒత్తిడి లేదని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌ బోర్డ్‌ ఆఫ్‌ మదర్సా ఎడ్యుకేషన్‌ యాక్ట్‌, 2004ను చట్టం రాష్ట్రంలోని మదర్సాలను నియంత్రిస్తుంది. ఈ చట్టం లౌకికవాద నిబంధనలను ఉల్లంఘిస్తుందని హైకోర్టు ముగించింది. వారిని ముఖ్యంగా గుర్తింపు పొందిన మదర్సాలలోని విద్యార్థులను సాధారణ పాఠశాలలకు బదిలీ చేయాలని ఆదేశించింది.

మదర్సాలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 28ని ఉల్లంఘించాయని, ఈ ఆర్టికల్‌ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే విద్యాసంస్థల్లో మతపరమైన బోధనను నిషేధించిందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. మదర్సాలో సైన్స్‌, మ్యాథ్స్‌ మతపరమైన బోధనలో భాగంగానే బోధిస్తున్నారని ప్రత్యేకంగా శిక్షణనివ్వడం లేదని ఆరోపించారు.

మదర్సాలో విద్యార్థికి ఇచ్చే సర్టిఫికేట్‌ ఇతర సంస్థల్లో పిజి చేసేందుకు చెల్లుబాటు అవుతుందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మదర్సాలకు యూనివర్శిటీ హోదా ఇవ్వాలని 2002లో అభ్యర్థించినా… అది ముందుకు సాగలేదని ఎమ్మెల్యే గురుస్వామి పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై నేడు కూడా విచారణ కొనసాగనుంది.

➡️