- ఆడియో క్లిప్స్‌లోని ఉన్నది ఆయన గొంతే
- సుప్రీంకోర్టుకు ‘ట్రూత్ ల్యాబ్’ నివేదిక
న్యూఢిల్లీ : మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌కు షాక్ తగిలింది. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాకాండలో ఆయన పాత్రకు సంబంధించి కొన్ని ఆడియో క్లిప్స్ ఇప్పటికే బయటకు వచ్చాయి. హింసను ప్రేరేపించేలా ఆయన మాట్లాడారని విమర్శలు ఉన్నాయి. ఈ ఆడియో క్లిప్స్‌లో ఉన్నది బీరెన్ సింగ్ స్వరమేనని ట్రూత్ ల్యాబ్ నివేదిక పేర్కొంది. క్లిప్స్‌లోని స్వరంతో బీరెన్ సింగ్ స్వర నమూనాలు 93 శాతం మ్యాచ్ అయ్యాయని ప్రయివేటు ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ అయిన ట్రూత్ ల్యాబ్ నివేదిక వివరించింది. దీంతో ఆ రెండూ ఒకే గొంతు అనటానికి ‘అధిక అవకాశం’ ఉన్నదని పేర్కొన్నది. ఈ మేరకు దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు నివేదిక అందింది. జ్యుడిషియల్ కమిషన్‌కు సమర్పించిన క్లిప్‌లలో బీరెన్‌సింగ్‌కు చెందినదిగా చెప్పబడుతున్న గొంతు ప్రామాణికతను ధృవీకరించటానికి ఈ ప్రయివేటు ల్యాబ్ పని చేసింది. బీరెన్‌సింగ్‌కు చెందిన అధికారిక ప్రాంతాల నుంచే తాము వీటిని రికార్డు చేసినట్టు ఆడియో రికార్డింగ్‌లను అందించినవారు తెలిపారు. దీనికి సంబంధించి ఒక కాపీని మణిపూర్ హింసాకాండపై ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్ చైర్‌పర్సన్ రిటైర్డ్ జస్టిస్ అజరు లంబాకు అందించామని చెప్పారు. ఈ కమిటీని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ గతేడాది మే, 3న ఏర్పాటు చేసింది. దీని తర్వాతే, ఆడియో టేప్ విషయంలో కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తును కోరుతూ కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ (కేఓహెచ్‌యూఆర్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆడియో టేప్‌లోని గొంతు ప్రామాణికతను వెరిఫై చేసి, కోర్టుకు నివేదిక సమర్పించాలని గతేడాది నవంబర్ 8న పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషనర్‌ను ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్ తరఫున న్యాయవాది అయిన ప్రశాంత్ భూషన్ ట్రూత్ ల్యాబ్ సేవలను కోరారు. దీంతో ట్రూత్ ల్యాబ్ సర్టిఫికేషన్ నివేదిక కాపీని అటాచ్ చేస్తూ ప్రశాంత్ భూషన్ గతనెల 22న సుప్రీంకోర్టలో సప్లిమెంటరీ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను కోర్టు సోమవారం చేపట్టింది. ఈ విచారణలో ఆడియో టేప్‌ను ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) ద్వారా వెరిఫై చేయించటానికి మూడువారాల సమయం కావాలని మణిపూర్, కేంద్ర ప్రభుత్వాల తరఫున కోర్టు ముందు హాజరైన సొలిసిటర్ జనరల్(ఎస్‌జీ) మెహతా న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజరు కుమార్‌లు ఓకే చెప్పారు. సీఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టును మూడువారాల్లోగా సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేశారు.