సత్వరమే సిబిఐ దర్యాప్తునకు ఆదేశించండి: పిటిషనర్ల అభ్యర్థన
వచ్చేనెల 8న విచారణ
న్యూఢిల్లీ : నీట్ పరీక్షలో అవకతవకలపై రిటైర్డ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి చేతకానీ లేదా దర్యాప్తు సంస్థతో కానీ సత్వరమే విచారణ జరిపించాలన్న పిటిషనర్ల అభ్యర్థనపై సుప్రీంకోర్టు కేంద్రానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ)కి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై సత్వరమే సిబిఐ చేత దర్యాప్తు జరిపించాల్సిన అవసరముందని పిటిషన్‌దారులు పేర్కొన్నారు. దీనిపై జులై8న విచారణ చేపట్టనున్నట్లు న్యాయమూర్తులు విక్రమ్‌నాథ్, సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్ తెలిపింది. అయితే జులై6 నుంచి జరిగే కౌన్సెలింగ్‌ను ఆపాలన్న పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీం తిరస్కరించింది. దీనిపై సత్వరమే సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలన్న పిటిషనర్ల వాదనపై జస్టిస్ విక్రమ్‌నాథ్ స్పందిస్తూ ” వారి పరోక్షంలోనే సిబిఐ దర్యాప్తు ఆదేశాలు జారీ చేయగలమా? ఇదేనా మీ వాదన? మీరు కోరిన రిలీఫ్‌ను తిరస్కరించడం లేదు. కానీ ముందుగా వారి స్పందనను కూడా తెలుసుకుందాం.” అని చెప్పారు. రికార్డు సంఖ్యలో విద్యార్థులు కచ్చితమైన స్కోర్లను సాధించడంతో సిబిఐ దర్యాప్తు కావాలని చివరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) జూనియర్ డాక్టర్ల నెట్‌వర్క్ కూడా డిమాండ్ చేస్తోందని పిటిషనర్లలో ఒకరి తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది చారూ మాథూర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కూడా నీట్ ఫలితాలపై దర్యాప్తును కోరుతున్నాయన్నారు. ఇదంతా చూస్తుంటే అక్రమాలు, అవకతవకలు జరిగాయని స్పష్టమవుతోందని పిటిషనర్లు ఆర్ష్ సమీర్ వ్యాస్ తదితరులు పేర్కొన్నారు. ఒఎంఆర్ షీట్‌లతో పోలిస్తే విద్యార్ధులకు వారి స్కోర్‌కార్డులపై వివిధ మార్కులు వచ్చాయని, అనూహ్యమైన రీతిలో కటాఫ్ మార్కులు, సగటు మార్కులు పెరిగాయని, ఫలితంగా గతంలో ఎన్నడూలేని రీతిలో 67మంది అభ్యర్ధులకు 720 మార్కులకు గాను 720 రావడం ఎలా సాధ్యమని వారు తెలిపారు. వీరిలో ఆరుగురు టాపర్లు హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన వారేనని వివరించారు. మరికొంతమందికి 718, 719 మార్కులు వచ్చాయి, అవి కూడా గణాంకాలపరంగా ప్రశ్నార్థ్ధకంగానే వున్నాయి, అసలు సమయాన్ని కోల్పోయినందుకు నష్టపరిహారంగా ఏ పద్ధ్దతిని అనుసరించారు, దానికి గల ప్రామాణికాలు ఏమిటన్న విషయాలు వెల్లడించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు.
వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో వున్న పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాల్సిందిగా కోరుతూ ఎన్‌టిఎ కూడా సుప్రీంను ఆశ్రయించింది. దానిపై కూడా బెంచ్ నోటీసులు జారీ చేసింది.
