27 వారాల గర్భవిచ్ఛిత్తికి సుప్రీం నిరాకరణ

May 16,2024 00:22 #27 week abortion, #supreem court
  • పిండానికీ జీవించే హక్కు ఉందని వ్యాఖ్య

న్యూఢిల్లీ : తల్లి కడుపులోని పిండానికీ జీవించే ప్రాథమిక హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 27 వారాల గర్భాన్ని తొలగించాలంటూ 20 ఏళ్ల అవివాహిత చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ‘గర్భం దాల్చి ఏడు నెలలు పూర్తి కావొస్తోంది. చిన్నారి మనుగడ మాటేమిటీ? ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? తల్లి కడుపులోని పిండానికీ జీవించే ప్రాథమిక హక్కు ఉంది. దాని గురించి ఏం చెబుతారు?’ మెడికల్‌ బోర్డు ఇచ్చిన నివేదిక ప్రకారం.. పిండంతోపాటు తల్లి కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఆ గర్భాన్ని కొనసాగించేందుకు మహిళకు ఎటువంటి ప్రమాదం లేదు. గర్భవిచ్ఛిత్తికి నైతికంగా, చట్టపరంగా అనుమతి లేదు. చట్టానికి విరుద్ధంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేం’ అని ధర్మాసనం స్పష్టంచేసింది.
తన గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన ఒక మహిళ అక్కడి హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం.. 27 వారాల గర్భం కావడంతో… దాన్ని తొలగించేందుకు నిరాకరిస్తూ మే 3న తీర్పు వెలువరించింది. దీనిని బాధిత మహిళ సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. జస్టిస్‌ బీఆర్‌ గవారు నేతృత్వంలోని జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీ, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది.
మహిళ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ యాక్టు కేవలం తల్లి గురించే చెబుతోందన్నారు. బిడ్డ కడుపులో ఉన్నందున.. డెలివరీ అయ్యేవరకు అది తల్లి హక్కు అవుతుందన్నారు. తన క్లయింటు నీట్‌ పరీక్షకు సిద్ధమవుతున్నారని.. తీవ్ర మానసిక వేదనతో బయటకు కూడా రాలేకపోతున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సమాజాన్ని ఎదుర్కోలేరన్నారు. ఈనేపథ్యంలో ఆమె మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

➡️