ఎన్నికల బాండ్లపై సుప్రీం తీర్పు ఎప్పుడో…?

  • నవంబర్‌ 2న రిజర్వ్‌ చేసిన కోర్టు

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం దేశ ప్రజలందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల బాండ్ల పథకం-2018లోని క్లాజ్‌ 8 ప్రకారం బాండ్లను జనవరి, ఏప్రిల్‌, జూలై, అక్టోబర్‌ నెలల్లో విడుదల చేయవచ్చు. ఇవి నిర్దేశిత బ్యాంక్‌ ఎన్‌బీఐ వద్ద పది రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ సార్వత్రిక ఎన్నికలు వస్తే అదనంగా 30 రోజుల సమయం ఇవ్వవచ్చు. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ఈ అదనపు సమయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఎన్నికల బాండ్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. గత సంవత్సరం నవంబర్‌ 2న న్యాయస్థానం విచారణను పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌లో వుంచింది. గత సంవత్సరం సెప్టెంబర్‌ 30వ తేదీ తర్వాత ఎన్నికల బాండ్లను 35 రోజుల పాటు విక్రయించారు. అక్టోబరులో 10 రోజులు, నవంబరులో 15 రోజులు, ఈ ఏడాది జనవరిలో 10 రోజులు వీటిని అమ్మారు. 2018 మార్చి నుండి గత సంవత్సరం సెప్టెంబరు వరకూ 30 దశలుగా ఎన్నికల బాండ్ల విక్రయం జరిగింది. కోటి రూపాయల విలువ కలిగిన బాండ్లనే ఎక్కువగా విక్రయించారు. బాండ్లలో అమ్ముడైన బాండ్లలో 57% అధికారంలో ఉన్న పార్టీకే సొంతమయ్యాయి. అంటే ఇవి పాలక పక్షానికే ఎక్కువ ఉపయోగపడతాయని అర్థమవుతోంది. ఈ ఎన్నికల బాండ్ల విధానాన్ని సిపిఐ(ఎం) ఒక్కటే మొదటి నుంచి నికరంగా ఎదిరిస్తున్నది. ఆ బాండ్లను తీసుకోకూడదని ఆ పార్టీ నిర్ణయించుకుంది. ఈ నెల 5న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఎస్‌బీఐ నుండి రూ.16,518 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశారని తెలిపారు. ప్రభుత్వం రూ.8.57 కోట్లను ఎస్‌బీఐకి కమిషన్‌గా చెల్లించిందని చెప్పారు. బాండ్ల ముద్రణ కోసం సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌కు రూ.1.90 కోట్లు చెల్లించారు. ఈ ఖర్చును దేశ పౌరులే భరించాల్సి ఉంటుంది. అంతేకాక బాండ్లపై 18% జీఎస్టీ విధించారు. అయితే దీనిని ఎస్‌బీఐకి ప్రభుత్వం రియంబర్స్‌ చేసింది. అంటే ఈ భారం కూడా పౌరుల పైనే పడింది. ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు త్వరితగతిన తీర్పు ఇవ్వని పక్షంలో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందు మరోసారి దశలవారీగా బాండ్ల జారీని ప్రకటించే అవకాశం ఉంది.

➡️