ఎన్‌డిఎ కూటమిలో మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఉండదు : సుప్రియా సూలె

ముంబయి :   ఎన్‌డిఎలో మిత్ర పక్షాలకు సమాన ప్రాధాన్యత ఉండదని ఎన్‌సిపి (శరద్‌పవార్‌) ఎంపి సుప్రియా సూలే వ్యాఖ్యానించారు. మోడీ నూతన కేబినెట్‌లో అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సిపికి  చోటు దక్కకపోవడంపై ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అజిత్‌పవార్‌కు  కేబినెట్ హోదా దక్కకపోవడంలో పెద్ద    ఆశ్చర్యమేమీ లేదని, గత పదేళ్లుగా తన మిత్రపక్షాల పట్ల బిజెపి వ్యవహరిస్తున్న తీరును తాను గమనించానని అన్నారు. ఎన్‌డిఎ కూటమిలో వారికి సమాన ప్రాతినిథ్యం ఉండదని విమర్శించారు. తన తండ్రి శరద్‌ పవార్‌ స్థాపించిన నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం పూణెలో ఆమె మీడియాతో మాట్లాడారు.

”యుపిఎ ప్రభుత్వ హయాంలో ఎన్‌సిపి మిత్రపక్షంగా పనిచేసింది. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం శరద్‌ పవార్‌ పట్ల విశ్వాసం, ప్రేమ కనబరిచింది. ఆ సమయంలో పార్టీకి ఎనిమిది లేదా తొమ్మిది మంది ఎంపిలు మాత్రమే ఉన్నప్పటికీ ఆయనకు రెండున్నర మంత్రిత్వ శాఖలను కేటాయించారు” అని అన్నారు. కాంగ్రెస్‌ ఎంపిల సంఖ్యను పట్టించుకోలేదని, మిత్రపక్షాలకు తగిన గౌరవం కల్పించిందని అన్నారు.

మహారాష్ట్రలోని గత మహావికాస్‌ అఘాడీ (ఎంవిఎ) ప్రభుత్వంలోనూ అందరూ ఒకరినొకరు గౌరవంగా చూసుకున్నారని అన్నారు. తాము ఏ ఫార్ములాకు కట్టుబడలేదని అన్నారు. కానీ ఎన్‌డిఎ కూటమిలో బిజెపి మిత్ర పక్షాలకు సమాన హోదా కల్పించదని ఎద్దేవా చేశారు. ఎన్‌డిఎ మొదటి కేబినెట్‌ సమావేశంపై స్పందిస్తూ.. మోడీ ప్రభుత్వం రైతులకు పూర్తి రుణ మాఫీ మంజూరు చేయాలని సూచించారు. రైతులపై ఒత్తిడి లేకుండా రుణమాఫీ ప్రకటించాలని, పాలు, ఉల్లి ధరలపై తగిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

➡️