టీ షర్టులే అడ్డంకా?

  • ‘డీ లిమిటేషన్‌’పై తమిళ ఎంపిల నిరసన సాకుతో ఉభయ సభలు వాయిదా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తమిళనాడు ఎంపిలు ధరించిన టీ షర్టులను సాకుగా చూపుతూ పార్లమెంట్‌ ఉభయ సభలు జరిపేందుకు లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌ నిరాకరించారు. ఆ ఎంపిలు ధరించిన టీ షర్టులపై ”న్యాయమైన డీలిమిటేషన్‌, తమిళనాడు పోరాడుతోంది, తమిళనాడు గెలుస్తుంది” అనే నినాదం ఉంది. ఆ నినాదం ఎందుకు కోపం తెప్పించిందో, ఆ నినాదం పార్లమెంట్‌ నిర్వహణలో ఎక్కడ సమస్యగా మారిందో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఆ టీషర్టులను విడిచిపెట్టి వస్తేనే సభ నిర్వహిస్తామని పేర్కొంటూ పార్లమెంట్‌ ఉభయ సభలను వాయిదా వేశారు.

‘తమిళనాడు న్యాయమైన డీలిమిటేషన్‌ కోసం పోరాడుతుంది’ అనే నినాదంతో కూడిన టీ-షర్టులు ధరించి డిఎంకె ఎంపిలు పార్లమెంట్‌కు హాజరయ్యారు. లోక్‌సభలో డిఎంకె ఎంపిలు టీ-షర్టులు ధరించి ఉండటం చూసిన స్పీకర్‌ ఓం బిర్లా ‘కొంతమంది సభ్యులు సభా మర్యాదలు, నియమాలను ఉల్లంఘిస్తున్నారు. సభా సభ్యుల ప్రవర్తనకు సంబంధించి 349వ నియమం స్పష్టమైన సూచనలను కలిగి ఉంది’ అని అన్నారు. ‘మీరు నినాదాలు రాసిన టీ-షర్టులు ధరించి సభకు వస్తే, సభా కార్యకలాపాలు ముందుకు సాగవు. టీ-షర్టులు మార్చిన తరువాతే కార్యకలాపాలు ప్రారంభిస్తాం’ అని స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. వెంటనే స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనప్పుడు డిఎంకె ఎంపిలు టీ-షర్టులతోనే సభకు వచ్చారు. వెంటనే సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో కూడా డిఎంకె ఎంపిలు టీషర్టులతోనే సభకు హాజరయ్యారు. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు. మూడు, నాలుగు నిమిషాల్లోనే సభ నేటీకి వాయిదా పడింది.

రాజ్యసభలోనూ ఇదే తంతు

మరోవైపు రాజ్యసభలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. డిఎంకె ఎంపిలు టీ-షర్టుల్లో కూర్చున్నట్లు గమనించిన రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ సభా కార్యకలాపాలను నిలిపివేసి, గంటసేపు వాయిదా వేశారు. సభలోని వివిధ పార్టీల నాయకులతో చర్చించాల్సిన కొన్ని విషయాలు తనకు ఉన్నాయని అన్నారు.

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు, తమిళనాడును అవమానించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాసిన దుస్తులను కూడా కొంతమంది ఎంపిలు ధరించారు. ఛైర్మన్‌ నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో టీ-షర్టులను తొలగించే ప్రసక్తే లేదని డిఎంకె ఎంపిలు స్పష్టం చేశారు. మధ్యాహ్నం సభ తిరిగి సమావేశమైనప్పుడు, టీ-షర్టు అంశంపై వాదనలు జరిగాయి. దీని తరువాత, డిప్యూటీ స్పీకర్‌ సభను శుక్రవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కనిమొళి నేతృత్వంలోని డిఎంకె ఎంపిలు పార్లమెంటు వెలుపల డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీవ్రంగా నిరసన తెలిపారు. ”తమిళనాడు న్యాయమైన డీలిమిటేషన్‌ కోసం పట్టుబడుతోంది. దీనివల్ల దాదాపు ఏడు రాష్ట్రాలు ప్రభావితమవుతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నుండి ఇంకా స్పందన రాలేదు. అందుకే న్యాయమైన డీలిమిటేషన్‌ డిమాండ్‌ చేస్తూ మేము మా నిరసనను కొనసాగిస్తున్నాం” అని డిఎంకె ఎంపి తిరుచ్చి శివ అన్నారు.

➡️