తమిళనాడు గవర్నర్‌ వికృత పోకడ

  • అసెంబ్లీ నుండి అర్ధంతరంగా వెళ్ళిపోయిన తమిళనాడు గవర్నర్‌
  • కేంద్రాన్ని విమర్శించే ప్రసంగం చదవనంటూ వ్యాఖ్యలు

చెన్నై : సోమవారం అసెంబ్లీ సమావేశాల నుండి గవర్నర్‌ రవి అర్ధంతరంగా లేచి వెళ్లిపోయారు. కేంద్రాన్ని విమర్శించేలా తమిళనాడు ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదివేందుకు ఆయన తిరస్కరించారు. మధ్యలోనే ప్రసంగాన్ని ఆపివేసి, జాతీయ గీతాన్ని ఆలపించేవరకు వుండకుండానే సర్రున లేచి వెళ్ళిపోయారు.

2024 సంవత్సరానికి అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవ ప్రసంగం చేయడం తన గౌరవంగా భావిస్తున్నానని తొలుత వ్యాఖ్యానిస్తూ కేవలం నాలుగు నిముషాల పాటు మాత్రమే ఆయన మాట్లాడారు. డిఎంకె ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో కొన్ని పేరాలతో తాను ఏకీభవించలేనని, వాస్తవిక, నైతిక ప్రాతిపదికన వాటితో విభేదిస్తున్నానని గవర్నర్‌ సొంత భాష్యం చెప్పారు. రాజ్యాంగ నియమాలను, సభా మర్యాదలను ఆయన మరోసారి తుంగలో తొక్కారు. జాతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. తమిళ భాషను ప్రశంసిస్తున్న గీతాన్ని సభా ప్రారంభానికి ముందుగా ఆలపించడం, సమావేశాల ముగింపులో జాతీయ గీతాన్ని ఆలపించడం తమిళనాడులో సంప్రదాయంగా వస్తోంది.

గవర్నర్‌ వెళ్లిపోవడంతో ఆ తర్వాత ఆ ప్రసంగాన్ని స్పీకర్‌ ఎం.అప్పవు చదివి వినిపించారు. బిజెపి ఎంఎల్‌ఎలతో సహా పాలక, ప్రతిపక్ష సభ్యులందరూ సమావేశం ముగిసేవరకు సభలోనే వున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షను ఎత్తిచూపుతూ ఆ ప్రసంగం సాగింది. జిఎస్‌టి, చెన్నై మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకపోవడం వంటి అంశాలను ప్రస్తావించింది. పైగా తమిళనాడు పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) అమలు చేసేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. దీనివల్ల భిన్నత్వంలో ఏకత్వం అన్న ఉద్దేశ్యానికే తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని వ్యాఖ్యానించింది.

గతేడాది బడ్జెట్‌ సమావేశాల ప్రారంభంలో కూడా గవర్నర్‌ రవి కొన్ని పేరాలను వదిలేసి చదివారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు, ద్రవిడ తరహా పాలన, అంబేద్కర్‌, ద్రవిడ నేతలు గురించి వున్న భాగాలను ఆయన వదిలేశారు. గవర్నర్‌ వ్యవహరించిన తీరును స్టాలిన్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

కేంద్రం విపక్షపై సూటిగా విమర్శ

48పేజీల ఈ ప్రసంగంలో, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తమిళనాడు సాధించిన విజయాలతో పాటు రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షను సూటిగా పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో తమిళనాడు తీవ్రమైన వరదల్లో చిక్కుకుంటే కేంద్రం పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్ధిక స్వయంప్రతిపత్తిని కూడా వదులుకుని, జిఎస్‌టిని అమలు చేయడానికి అంగీకరించాయని, రాష్ట్రాలకు తగిన నష్టపరిహారం అందుతుందని, చట్టబద్ధంగా తమకు రావాల్సిన రెవిన్యూ వస్తుందని ఆశించాయని, కానీ అలా జరగలేదని, కేంద్రం 2022 జూన్‌లో నష్టపరిహార నిబంధనలను రద్దు చేసిందని, దాంతో రాష్ట్రం ఏటా రూ.20వేల కోట్ల రెవిన్యూ లోటును ఎదుర్కొంటోందని ఇలా అడుగడుగునా రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శించింది.

చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టులో సగం ఖర్చు భరిస్తామని తొలుత ఇచ్చిన హామీ నుండి కేంద్రం వెనక్కి మళ్ళిందని, దాంతో రెండేళ్ళకు పైగా ఈ ప్రాజెక్టులో జాప్యం జరుగుతోందని తెలిపింది. ఇటువంటి ప్రాజెక్టులకు ఇతర రాష్ట్రాల్లో అనుమతులు మంజూరు చేస్తున్నారని ఇక్కడ కూడా మొదట అనుకున్న రీతిలో పరిస్థితులను పునరుద్ధరించాలని కోరింది. రాష్ట్రంలో మత సామరస్యతను పరిరక్షించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, దానికే కట్టుబడి వున్నామని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. సిఎఎను అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. 2021 నుండి ఆలస్యమవుతూ వస్తున్న జాతీయ జన గణనతో పాటూ కుల గణన కూడా చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి స్టాలిన్‌, ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

 

➡️