- మదురైలో వేలాది మంది అన్నదాతల ఆందోళన
- అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్రం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గమైన, అప్రజాస్వామిక విధానాలపై తమిళనాడు ప్రజానీకం కన్నెర్ర చేశారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై మోడీ సర్కార్ కక్షపూరిత ధోరణిని ఎండగట్టారు. తమిళనాడులో ఆ రాష్ట్ర ప్రజాభిమతానికి వ్యతిరేకంగా ఒక మైనింగ్ ప్రాజెక్టును కేంద్రం బలవంతంగా చేపట్టాడాన్ని నిరసిస్తూ మంగళవారం వేలాది మంది అన్నదాతలు ఆందోళన చేపట్టారు. మరోవైపు తమిళనాడు గవర్నరు రవి తీరుపైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తూ రాజ్యాంగ పదవిని ఆయన కలంకితం చేస్తున్నారని తప్పుబట్టారు.
మదురై జిల్లాలోని మేలూర్ తాలూకా వద్ద టంగ్‌స్టన్ మైనింగ్ ప్రాజెక్టును కేంద్రం చేపడుతోంది. ఈ ప్రాజెక్టు చేపట్టవద్దని రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల లాభాలే పరమావధిగా ఈ ప్రాజెక్టును బలవంతంగా చేపడుతోంది. దీనిని నిరసిస్తూ మదురైలో 25 కిలోమీటర్ల మేర రైతులు మంగళవారం భారీ ప్రదర్శన చేపట్టారు. మేలూర్, సమీప ప్రాంతాల నుండి దాదాపు 10,000 మందికి పైగా రైతులు, గ్రామస్తులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మదురై నగరంలోని నరసింగంపట్టి నుండి తాళ్లకుళం వరకు చేపట్టిన మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుచ్చి-మధురై జాతీయ రహదారి మీదుగా తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చేరుకున్న ఆందోళనకారులు ఒతకడై మీదుగా ఎంజిఆర్ బస్టాండ్ దాటి జిల్లా కోర్టు దగ్గర మలుపు తీసుకున్నారు. అక్కడి నుంచి తాళ్లకుళం చేరుకున్నారు. టిఎన్‌ఎయు, ఒతకడై, మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ వంటి కొన్ని ముఖ్యమైన జంక్షన్ల వద్ద పోలీసులు బారికేడ్లు వేసినప్పటికీ, రైతులు వాటిని చేధించి ముందుకు సాగారు. అయితే, భారీ జనసమూహాన్ని నిరోధించేందుకు అనేక మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అడ్డంకులను చేధించుకొని వేలాది మంది రైతులు నిరసన ప్రదేశానికి చేరుకొన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ బైఠాయించారు. ప్రాజెక్టు కోసం కేటాయించిన 5 వేల ఎకరాల్లో కేవలం 500 ఎకరాలు వదిలేయడం వల్ల ప్రజలకు, పర్యావరణానికి ఎలాంటి మేలు జరగదన్నారు. మైనింగ్ ప్రాజెక్టులతో పర్యావరణానికి నష్టం వాటిల్లడాన్ని ఇప్పటికే అనేక ఘటనలు స్పష్టం చేశాయని, ఇకపై మా భూమి విధ్వంసాన్ని తట్టుకోలేమని సష్టం చేశారు.
జీవనోపాధులపై దాడి : సిపిఎం నేత నాగరాజన్
రాష్ట్ర ప్రభుత్వం వద్దేవద్దు అని చెబుతున్నా కేంద్రంలోని మోడీ సర్కార్ బలవంతంగా చేపడతున్న టంగ్‌స్టన్ మైనింగ్ ప్రాజెక్టు వల్ల స్థానిక ప్రజలు జీవనోపాధులను కోల్పోతారని సిపిఎం నాయకులు, మదురై డిప్యూటీ మేయర్ టి నాగరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు ఈ ప్రాంతంలో అనేక చారిత్రక చిహ్నాలు కూడా ధ్వంసం కానున్నాయని తెలిపారు. సిపిఎం సీనియర్ నేత ఎకె పద్మనాభన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రెండు నెలలుగా సిపిఎం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిల్లో ఉద్యమిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని, ప్రజలు డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ నిరసనకు మద్దతుగా ఆగ్రో ఫుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ ప్రెసిడెంట్ ఎస్ రత్నవేలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రజల ఏకైక జీవనోపాధి వ్యవసాయమని, ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణం తగ్గిపోయి ఆహార ఉత్పత్తిపైనే తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఉపాధి పైనా, వ్యవసాయోత్పత్తులపైనా వినాశకర ప్రభావం చూపనున్న ఈ ప్రాజెక్టును తక్షణమే విమరించుకోవాలని డిమాండ్ చేశారు.