Tamilnadu: దేవనాగరి రూపాయి గుర్తుకు బదులుగా తమిళ అక్షరం

 బడ్జెట్‌ లోగోను మార్చిన తమిళనాడు
  ‘ఎల్లోర్‌కుమ్‌ ఎల్లమ్‌’ పేరుతో
కొత్త ముద్ర ఆవిష్కరించిన స్టాలిన్‌
చెన్నయ్: తమపై బలవంతంగా హిందీని రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడుతున్న తమిళనాడు ప్రభుత్వం తాజాగా బడ్జెట్‌ లోగోనే మార్చేసింది. ఆ లోగోలో దేవనాగరి లిపిలో ఉండే రూపాయి చిహ్నం స్థానంలో తమిళ రూపాయి అక్షరాన్ని ఉంచింది. ‘ఎల్లోర్‌కుమ్‌ ఎల్లమ్‌’ (అందరి కోసం అన్నీ) అని రాసి ఉన్న లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కార్యాలయం గురువారం మధ్యాహ్నం విడుదల చేసింది. గత సంవత్సరం లోగోలో రూపాయి చిహ్నం దేవనాగరి లిపిలోనే ఉంది. ‘ఈ సంవత్సరం దేవనాగరి లిపి కంటే తమిళానికే మేము ప్రాధాన్యత ఇచ్చాం’ అని సీఎంఓ వర్గాలు తెలిపాయి. కాగా ఈ ఏడాది తమిళానికి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నామని డీఎంకే ప్రతినిధి సవరణన్‌ అన్నాదురై చెప్పారు.
త్రిభాషా సూత్రంపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య వివాదం తీవ్రమవుతున్న తరుణంలో డీఏంకే ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం గమనార్హం. ద్విభాషా సూత్రాన్ని (తమిళం, ఆంగ్లం) అనుసరిస్తున్న తమిళనాడు త్రిభాషా సూత్రాన్ని గట్టిగా వ్యతిరేకిస్తోంది. అంతేకాక త్రిభాషా విధానాన్ని సూచిస్తున్న జాతీయ విద్యా విధానాన్ని కూడా నిరసిస్తోంది. తమిళనాడు బడ్జెట్‌ను శుక్రవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు నేతృత్వంలోని బడ్జెట్‌ కమిటీ లోగో మార్పుపై నిర్ణయం తీసుకున్నదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ‘మా భాషను, మా నాగరికతను పార్లమెంటులో కూడా అపహాస్యం చేస్తుంటే మేము దానిని రక్షించుకోవద్దా?’ అని డీఏంకే నేత ఒకరు ప్రశ్నించారు. కాగా లోగోను మార్చాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆమోదముద్ర వేశారు. తమిళనాడు ప్రభుత్వం మార్చిన రూపాయి చిహ్నానికి డీఏంకే ఎమ్మెల్యే కుమారుడు రూపకల్పన చేశారు. ఆయన ప్రస్తుతం ఐఐటీ గౌహతి డిజైన్‌ విభాగానికి అధిపతిగా కొనసాగుతున్నారు.

➡️