Tamilnadu : గవర్నర్‌, రాష్ట్రపతి ఆమోదం లేకుండా గెజిట్‌లో పది చట్టాలు

చెన్నై : తమిళనాడు ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకున్నది. గవర్నర్‌, రాష్ట్రపతి ఆమోదం లేకుండా పది చట్టాలను గెజిట్‌లో నోటిఫై చేసింది. ఇలా చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తమిళనాడు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
కాగా, తమిళనాడు ఆమోదం తెలిపిన చట్టాలలో.. తమిళనాడు శాసనసభ చట్టాలలో తమిళనాడు ఫిషరీస్‌ యూనివర్సిటీ (సవరణ) చట్టం 2020 (గతంలో తమిళనాడు డాక్టర్‌ జె. జయలలిత ఫిషరీస్‌ యూనివర్సిటీగా ఉన్న పేరు మార్పు), విశ్వవిదాల్యలయాల చట్టాలు (సవరణ) చట్టం 2022, తమిళనాడు డాక్టర్‌ అంబేద్కర్‌ లా యూనివర్సిటీ (సవరణ) చట్టం 2022, డాక్టర్‌ ఎం.జి.ఆర్‌ మెడికల్‌ యూనివర్సిటీ చెన్నై (సవరణ) చట్టం 2022, వ్యవసాయ విశ్వవిద్యాలయాల (సవరణ) చట్టం 2022, విశ్వవిద్యాలయ (రెండవ సరణ) చట్టం 2022, మత్స్య విశ్వవిద్యాలయ (సవరణ) చట్టం 2023, వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (సవరణ) చట్టం 2023, విశ్వవిద్యాలయాల చట్టాలు (రెండవ సవరణ) చట్టం 2022 ఉన్నాయి.
చాలా చట్టాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలలో వైస్‌ ఛాన్సలర్ల నియామకాలకు సంబంధించినవి. ఈ చట్టాల ఆమోదం వల్ల ఇప్పటివరకు గవర్నర్‌- ఛాన్సలర్‌లకు ఉన్న అధికారాలు తొలగి.. ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. సుప్రీంకోర్టు తీర్పుతో చట్టాలు ఆమోదం పొందడంతో సిఎం స్టాలిన్‌ హర్షం వ్యక్తం చేశారు. డిఎంకె అంటే చరిత్ర సృష్టించడం అని ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.

➡️