ఆగని టారిఫ్‌ వార్‌

Apr 13,2025 23:55 #China, #never-ending, #Tariff War, #usa
  • త్వరలో ఎలక్ట్రానిక్స్‌, ఫార్మావస్తువులపై సుంకాలు
  • యుఎస్‌ కామర్స్‌ సెక్రెటరీ హోవార్డ్‌ లుట్నిక్‌
  •  భారత్‌ పైనా తీవ్రప్రభావం

న్యూఢిల్లీ : చైనా ఆధిపత్యం కలిగిన ఎలక్ట్రానిక్‌, ఫార్మావస్తువులపై సుంకానికి అమెరికాలోని డోనాల్ట్‌ ట్రంప్‌ యంత్రాంగానికి సిద్ధమవుతున్నది. ఈ విషయంలో యూఎస్‌ కామర్స్‌ సెక్రెటరీ హోవార్డ్‌ లుట్నిక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, కొన్ని ఇతర ఎలక్ట్రానిక్స్‌ ప్రత్యేక టారిఫ్‌ల కిందకు రానున్నాయని చెప్పారు. ఒకనెలలోపు సెమీకండక్టర్‌లపై సుంకాల విధింపులు ఉంటాయని చెప్పారు. చైనా దిగుమతులపై ప్రతిపాదిత 145 శాతం పరస్పర సుంకాల నుంచి స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి కీలకమైన ఎలక్ట్రానిక్‌లను మినహాయించాలని డోనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం గతవారం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఇప్పుడు ఆ మినహాయింపు తాత్కాలికమేనంటూ లుట్నిక్‌ నుంచి ఈ ప్రకటన రావటం గమనార్హం.

అది తాత్కాలిక ఉపశమనమే
సుంకాల నుంచి వివిధ రకాల ఎలక్ట్రానిక్‌ పరికరాలను మినహాయించాలని ఈనెల 2న ప్రకటించిన ట్రంప్‌ పాలనాయంత్రంగం నిర్ణయం తాత్కాలిక ఉపశమనమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉత్పత్తులు త్వరలో ‘సెమీకండక్టర్‌ టారిఫ్‌’లను ఎదుర్కోనున్నాయనీ, ఒకటి లేదా రెండు నెలల్లో అమల్లోకి వస్తాయని వివరించారు. ”మనకు చిప్స్‌ ఉండాలి. సెమీకండక్టర్స్‌ ఉండాలి. ఫ్లాట్‌ప్యానెల్లు ఉండాలి. ఈ వస్తువులను మనం అమెరికాలో తయారు చేయాలి. మనకు సంబంధించిన అన్ని విషయాల కోసం మనం ఆగేయాసియా, ముఖ్యంగా చైనాపై ఆధారపడలేం” అని ఆయన అన్నారు. వాటిని పరస్పర సుంకాల నుంచి మినహాయించినట్టు అధ్యక్షుడు ట్రంప్‌ చెప్తున్నా.. అవి సెమీకండక్టర్‌ సుంకాలలో చేర్చబడ్డాయని చెప్పారు. ఇవి బహుశా ఒకటి లేదా రెండు నెలల్లో వస్తున్నాయని అన్నారు.

ఔషధ సుంకాల విధింపు
ఒకటి లేదా రెండు నెలల్లో ఔషధ సుంకాల విధింపు ఉంటుందని చెప్పారు. సెమీకండక్టర్‌ , ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలు తమ వ్యాపారాన్ని అమెరికాకు తరలించే విషయంలో ప్రోత్సహించటానికి ట్రంప్‌ యంత్రాంగం ‘టారిఫ్‌ మోడల్‌’ను అమలు చేస్తుందని నొక్కి చెప్పారు. ”మనకు అవసరమైన ప్రాథమిక విషయాల కోసం విదేశాలపై ఆధారపడొద్దు. కాబట్టి ఇది శాశ్వత మినహాయింపు కాదు. ఇవి మనం అమెరికాలో తయారు చేసుకోవాల్సిన జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు” అని ఆయన అన్నారు.

భారత్‌ పైనా ఎఫెక్ట్‌
ఇక అమెరికా కొత్త టారిఫ్‌ విధింపుల భయాలు భారత్‌లోనూ నెలకొన్నాయి. ట్రంప్‌ యంత్రాంగం నిర్ణయం భారత్‌లోని ఎలక్ట్రానిక్స్‌, ఫార్మా రంగాలపై ప్రభావం చూపనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనెల 2న డోనాల్డ్‌ ట్రంప్‌ వివిధ దేశాలపై పరస్పర సుంకాలను ప్రకటించిన విషయం విదితమే. ఆ తర్వాత ఒక్క చైనా మినహా మిగతా దేశాలపై వాటిని 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశాడు. చైనా దిగుమతులపై అమెరికా యంత్రాంగం 145 శాతం సుంకాన్ని ప్రకటించింది. ప్రతిగా చైనా కూడా అదే స్థాయిలో దీటుగా బదులిచ్చింది. దీంతో రెండు బలమైన ఆర్థిక వ్యవస్థల మధ్య పరస్పర సుంకాలు వాణిజ్య యుద్ధానికి దారి తీశాయి.

➡️