ఒక్క మురికివాడను కూల్చం..

  • ఢిల్లీ ప్రచారంలో మోడీ హామీ

న్యూఢిల్లీ : ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఇక్కడ ఒక్క మురికివాడను కూడా కూల్చమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. తాము ప్రచారం కోసం ప్రకటనలు చేయమని, చేసిన వాగ్దానాలను నిలబెట్టుకునేందుకు బడ్జెట్‌లో వెసులుబాట్లు కల్పిస్తామని ఢిల్లీలోని ఆర్కే పురంలో ఆదివారంనాడు జరిగిన ర్యాలీలో మోడీ పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఢిల్లీలో అమలులో ఉన్న ప్రజాసంక్షేమ పథకాలన్నింటికీ తాము కొనసాగిస్తామని ఢిల్లీ ప్రజలకు మోడీ భరోసా ఇచ్చారు. ప్రజాప్రయోజనాలకే తాము పెద్దపీట వేస్తామని, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఏ పథకాన్ని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేసే ప్రసక్తి ఉండదని చెప్పారు. పూర్వాంచల్‌, బిహారీ కమ్యూనిటీల నుంచి తనకు పెద్ద సంఖ్యలో మెసేజ్‌లు వచ్చినట్టు చెప్పారు. ”వారి మనోభావాలను నేను అర్థం చేసుకోగలను. నేను కూడా పూర్వాంచల్‌ ఎంపీనే. కోవిడ్‌ సమయంలో వారి పట్ల కొన్ని పార్టీలు అనుచితంగా వ్యవహరించాయి. ఢిల్లీలోని బలవంతంగా పంపేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం పూర్వాంచల్‌, బీహార్‌ ప్రజలకు ఎప్పుడూ బాసటగా ఉంటుంది” అని అన్నారు. కేంద్రంలో బిజెపి మూడోసారి దేశానికి తాను సేవలందిస్తున్నానంటే దేశంలోని మహిళల ఆశీర్వాదమే కారణమని అన్నారు. మోడీ ఇచ్చే ప్రతి హామీలోనూ మహిళలకు కీలక భూమిక ఉంటుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీల అవినీతిపై మోడీ విమర్శలు గుప్పించారు. అవినీతిలో రెండూ ఒకటేనని విమర్శించారు. ప్రజలు సంపాదించుకునే దానిపై మాజీ ప్రధానులు జహహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ భారీగా పన్నులు వడ్డించే వారని, కానీ తమ ప్రభుత్వం పన్నుభారాన్ని సులభతరం చేసిందని వివరించారు. ఢిల్లీని ఆప్‌ ప్రభుత్వం నుంచి విముక్తి చెప్పాలని కార్యకర్తలందరినీ కోరుతున్నానని మోడీ తెలిపారు.

➡️