పాట్నా : బీహార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే అతిపెద్ద శత్రువు అని బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, ఆర్‌జెడి నాయకులు తేజస్వి యాదవ్ విమర్శించారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఆదివారం ప్రధాని మోడీ మాట్లాడుతూ జార్ఖండ్‌కు మూడు అతి పెద్ద శత్రువులు జెఎంఎం, ఆర్‌జెడి, కాంగ్రెస్ అని చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. సోమవారం పాట్నాలో విలేకరుల సమావేశంలో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ‘బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌కు కేంద్రం నో చెప్పింది. 11 ఏళ్ల తన పాలనలో మోడీ బీహార్‌ను పాతాళానికి నెట్టారు. మనం నీతి ఆయోగ్ నివేదికను పరిశీలిస్తే, బీహార్ పనితీరు అధ్వానంగా ఉందని, రాష్ట్రంలో గరిష్ట పేదరికం, దాదాపు 2.9 కోట్ల మంది వలస వెళ్లారని మనం తెలుసుకుంటాం. బీహార్‌లో తలసరి ఆదాయం అత్యల్పంగా ఉంది. ఈ విషయాలపై ప్రధాని ఏమైనా మాట్లాడతారా?.. జార్ఖండ్‌ను అత్యధిక కాలం బిజెపి పాలించింది. అలాంటప్పుడు అక్కడ అభివృద్ధికి శత్రువు ఎవరు?’ అని ప్రశ్నించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక ప్యాకేజీని కూడా కేంద్రం ఇవ్వలేదని అన్నారు. బీహార్‌లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం గురించి మాట్లాడ్డానికి మోడీ దగ్గరేమీ లేదని, అందుకే ‘హిందువులు, ముస్లింలు, మందిరం, మసీదు, పాకిస్థాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాలు’ వంటి పదాలతో మోడీ బిజీగా ఉన్నారని తేజస్వి యాదవ్ విమర్శించారు. బీహార్‌లో పెరుగుతున్న నేరాలను చూసి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెవిటి, మూగ, అంధుడిగా మారారని అన్నారు.
