మహిళల బాధలకు ఎవర్ని బాధ్యుల్ని చేస్తారు? : నితీష్‌పై తేజస్వి ఆగ్రహం

పాట్నా : ‘బీహార్‌ రాష్ట్రంలో మహిళలు అనేక కష్టాల్ని ఎదుర్కొంటున్నారు. వారు పడే బాధలకు ఎవర్ని బాధ్యుల్ని చేస్తారు?’ అని ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్‌ బీహార్‌ సిఎం నితీష్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి నిబద్ధత ఏమిటని ఆయన ప్రశ్నించారు. ‘బీహార్‌లో 63 శాతం గర్భిణులు పోషకాహారలోపంతో, రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రసూతి మరణాల రాష్ట్రాల్లో బీహార్‌ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో 59 శాతం మహిళలు మాత్రమే రుతుక్రమ ఉత్పత్తులు (శానిటరీ ప్యాడ్స్‌)ను ఉపయోగిస్తున్నారని ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాలే చెబుతున్నాయి. బీహార్‌ శాసనసభలో ఏ పార్టీ మహిళలను నిజంగా గౌరవిస్తుందో, ఏ పార్టీ అగౌరవపరుస్తుందో తెలుస్తుంది’ అని తేజస్వియాదవ్‌ ఎక్స్‌ వేదికగా నితీష్‌కుమార్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

➡️