టెలికాం సైబర్‌ సెక్యూరిటీ రూల్స్‌ నోటిఫై

Nov 23,2024 07:38 #Cyber Crimes, #Cyber Security

న్యూఢిల్లీ : టెలికాం సైబర్‌ సెక్యూరిటీ రూల్స్‌ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. భారతీయ కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్స్‌ సంస్థలు, సేవలకు రక్షణగానూ, భద్రతాపరమైన సంఘటనలను నివేదించడానికి, బహిర్గతం చేయడానికి సంస్థలకు ఖచ్చితమైన సమయ వ్యవధితోపాటు మరిన్ని అంశాలతో ఈ రూల్స్‌ను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రూల్స్‌ భద్రతా చర్యలతోపాటు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విధానాలు, చర్యలు, శిక్షణ, నెట్‌వర్క్‌ టెస్టింగ్‌, రిస్క్‌ అసెస్‌మెంట్‌ వంటి అంశాలతో పొందుపర్చి ఉన్నాయని కేంద్రం తెలిపింది. టెలికాం సంస్థలు కూడా ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం టెలికాం సంస్థల నుంచి ట్రాఫిక్‌ డేటా, ఇతర డేటా (మెసేజ్‌ల సారాంశం కాకుండా)లను కోరే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదా దాని అధికారిక సంస్థలకు ఉంటుంది. ఇచ్చిన సమాచారాన్ని టెలికాం సంస్థలు గోప్యంగా ఉంచుతాయి. ఈ నిబంధనల ప్రకారం టెలికాం సంస్థలు ఒక చీఫ్‌ టెలికమ్యూనికేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉంటుంది.
భద్రతాపరమైన సంఘటనలపై ఆరు గంటల్లోపు కేంద్రానికి ప్రాథమిక సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తరువాత 24 గంటల్లో ఈ సంఘటనతో ప్రభావితమైన వినియోగదారుల సంఖ్య, భౌగోళిక ప్రాంతం, ఈ సంఘటనను ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు వంటి అంశాలతో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. టెలికాం సంస్థలు ఏదైనా విదేశాల్లో తయారైన యంత్రాలు, సామాగ్రిని వినియోగిస్తున్నట్లయితే దానికి అంతర్జాతీయ మొబైల్‌ ఎక్వ్విప్‌మెంట్‌ ఐడెంటిటీ (ఐఎంఇఐ) సంఖ్యను తీసుకోవాల్సి ఉంటుంది.

➡️