- కోయంబత్తూరులో ప్రైవేట్ పాఠశాల నిర్వాకం
కోయంబత్తూరు : రుతుసావ్రం జరిగిందన్న పేరుతో 8వ తరగతి బాలికను గది వెలుపల మెట్లపై కూర్చోబెట్టి పరీక్ష రాయించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి సమీపంలో ఇటీవల జరిగింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో అధికారులు విచారణ జరుపుతున్నారు. పొల్లాచ్చి ఎఎస్‌పి శ్రీస్తిసింగ్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు సెంగుట్టాయిపాళయంలోని మెట్రిక్యులేషన్ పాఠశాలలో చదువుతున్నారు. ఇటీవల పాఠశాలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. రుతుస్రావంతో ఉన్న తన కుమార్తెకు ఇన్‌ఫెక్షన్లు సోకకుండా తరగతి గదిలో ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేయాలని బాధితురాలి తల్లి ముందుగా క్లాస్ టీచర్‌ను కోరారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌తో మాట్లాడాలని టీచర్‌ను సూచించారు. దీంతో ఈ నెల 7న కుమార్తెను పాఠశాల వద్ద దింపిన తల్లి ప్రిన్సిపాల్‌ను కలిసి తన విజ్ఞప్తి తెలిపారు. ఆమె వెళ్లిన తరువాత తరగతి గది వెలుపల కూర్చోబెట్టి విద్యార్థిని చేత పరీక్ష రాయించారు. ఇంటికి వెళ్లిన తరువాత బాలిక కాళ్ల నొప్పితో బాధపడింది. బుధవారం జరిగిన మరొక పరీక్షకు హాజరైన బాలికను తరగతి గది వెలుపల మెట్లపై కూర్చోబెట్టారు. దీన్ని చూసిన బాలిక బంధువులు తల్లికి సమాచారం ఇచ్చారు. తల్లి వెంటనే పాఠశాలకు వచ్చి ఈ దృశ్యాన్ని రికార్డు చేశారు. ఈ విషయంపై మెట్రిక్యులేషన్ స్కూల్స్ డైరెక్టర్ ఎ.పళనిసామి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నుంచి వివరణ కోరినట్లు తెలిపారు. అధికారులు విచారణ చేస్తున్నారని, నివేదిక అందిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిన్నారులకు ఉచిత, నిర్భంధపు విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 17 (చిన్నారులపై మానసిక, శారీరక వేధింపుల నిషేధం) కింద పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కరస్పాండెంట్ ఉత్తర్వులు జారీ చేశారు.