అదో కుటుంబ మంత్రివర్గం

Jun 11,2024 23:35 #Rahul Gandhi, #speech

ప్రియాంక పోటీ చేసుంటే మోడీ ఓడిపోయేవారు : రాహుల్‌గాంధీ
రాయ్ బరేలి : ప్రధాని మోడీ క్యాబినెట్‌ కుటుంబ మంత్రివర్గమని రాహుల్‌గాంధీ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. తరతరాలుగా సాగుతున్న పోరాటం, సేవ, త్యాగాలను బంధుప్రీతిగా విమర్శించేవారు (మోడీ) తమ మంత్రివర్గంలో వారసత్వాలకు పెద్ద పీట వేశారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ‘మాటలకు చేతలకు మధ్య వ్యత్యాసం ఉంటే ఆ వ్యక్తిని నరేంద్ర మోడీ అని అంటారు’ అని పేర్కొన్నారు. మోడీ తన నూతన మంత్రివర్గంలో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు కుమారస్వామికి, కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా కుమారుడు జ్యోతిరాదిత్య సింధియాకు, అరుణాచల్‌ ప్రదేశ్‌ స్పీకర్‌ రించిన్‌ ఖరు కుమారుడు కిరణ్‌ రిజిజుకు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఏకనాథ్‌ ఖడ్సే కోడలు రక్ష ఖడ్సేకు, మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ మనవడు జయంత్‌ చౌదరికి స్థానం కల్పించడాన్ని రాహుల్‌గాంధీ ప్రస్తావించారు. బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌ కుమారుడు రామ్‌నాథ్‌ ఠాకూర్‌, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు కుమారుడు రామ్‌మోహన్‌ నాయుడికి, కేంద్ర మాజీ మంత్రి వేద్‌ ప్రకాశ్‌ గోయల్‌ కుమారుడు పీయూష్‌ గోయల్‌కి, హర్యానా మాజీ మంత్రి రావు బీరేంద్ర సింగ్‌ కుమారుడు ఇంద్రజిత్‌ సింగ్‌కు మంత్రులుగా అవకాశం ఇవ్వడాన్ని రాహుల్‌ గుర్తు చేశారు.
2 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయేవారు
తాజా లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి ప్రియాంకగాంధీ పోటీ చేసి ఉంటే ప్రధానమంత్రి మోడీ అక్కడ కనీసం రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయేవారని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. రారుబరేలిలో నిర్వహించిన కృతజ్ఞతా సభలో ఆయన మాట్లాడుతూ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ బలాన్ని తగ్గించడానికి రారుబరేలీ, అమేథితోపాటు దేశంలోని ఇతర నియోజకవర్గాల్లో ఇండియా వేదిక పార్టీలు ఐక్యంగా పోరాటం చేశాయని అన్నారు. ఎన్నికల ఫలితాలపై అహంకారానికి లోనుకాకుండా, ప్రజల ప్రయోజనాల కోసం ఇండియా వేదిక ఎంపీలు పనిచేస్తామని రాహుల్‌గాంధీ ఈ సందర్భంగా తెలిపారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవంలో సామాన్య ప్రజలను విస్మరించిన మోడీ పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులకు ప్రాధాన్యత ఇచ్చారని, అయోధ్యలో ఓటమితో బిజెపికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ మాట్లాడుతూ రారుబరేలిలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

➡️