అందుకే సిఎం పదవికి రాజీనామా చేయలేదు : కేజ్రీవాల్‌

May 12,2024 11:00 #Arvind Kejriwal, #BJP, #Delhi goverment

న్యూఢిల్లీ :    అసత్యపు కేసులో ఇరికించి తనను బలవంతంగా రాజీనామాకు చేయించేందుకు బిజెపి కుట్ర పన్నిందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ విమర్శించారు. అందుకే సిఎం పదవికి రాజీనామా చేయలేదని, తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని అన్నారు. సుప్రీంకోర్టు శుక్రవారం కేజ్రీవాల్‌కు 21 రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఆయన లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటిసారి మీడియాతో మాట్లాడారు. నలుగురు అగ్రనేతలను జైలుకు పంపడంతో పాటు ఆప్‌ను అణచివేసేందుకు ప్రధాని ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని అన్నారు. పార్టీని నిర్మూలిద్దామని అనుకున్నారు. కానీ ఆప్‌ కేవలం పార్టీ కాదు అది ఓ ఆలోచన. వారు ఎంతగా అణిచివేయాలని చూస్తే.. తమ పార్టీ అంతగా పురోగమిస్తుందని అన్నారు. తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడాని, అవినీతి కేసుల్లో ఎవరినీ వదిలిపెట్టలేదని అన్నారు. ప్రతిపక్షాలు, మీడియాకు తెలియకుండా వారిని జైలుకు పంపారని మండిపడ్డారు.

జైలులో ఉన్నప్పుడు కూడా ప్రజల సంక్షేమం గురించి మంత్రులను అడిగి తెలుసుకున్నానని అన్నారు. తాను ప్రజలకు పాఠశాలలు, ఆస్పత్రులు అందించారు. ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు కల్పించాను. అందుకు తనకు జైలులో బిజెపి 15 రోజుల పాటు ఇన్సులిన్‌ను ఇవ్వకుండా అడ్డుకుందని ధ్వజమెత్తారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బిజెపి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదల్లేదని అన్నారు.

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి 230 సీట్ల కంటే ఎక్కువ రావని అన్నారు. హర్యానా, రాజస్థాన్‌, కర్ణాటక, ఢిల్లీ, బీహార్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో బిజెపికి లోక్‌సభ సీట్లు తగ్గుతాయని అన్నారు. ఏ రాష్ట్రంలోనూ వారికి సీట్లు పెరగవని అన్నారు. ఇది తన విశ్లేషణ మాత్రమే కాదని, రాజకీయ విశ్లేషకులు కూడా బిజెపికి 220-230 సీట్లు కంటే ఎక్కువ రావని స్పష్టం చేశారని అన్నారు.

➡️