- అదానీ ముడుపులపై పార్లమెంట్ కుదుపు
- ప్రధాని మోడీ నోరు విప్పాలి
- ప్రతిపక్షాల డిమాండ్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అదానీ ముడుపుల వ్యవహారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కుదిపేస్తోంది. అమెరికాలో అదానీ సంస్థపై నమోదైన కేసు, ఈ సంస్థపై వచ్చిన లంచం ఆరోపణలపై చర్చకు ప్రతిపక్ష సభ్యులు పట్టుపట్టారు. కానీ ప్రభుత్వం చర్చకు అంగీకరించకపోవడంతో గత రెండు రోజులుగా ఉభయసభల్లో తుడిచిపెట్టుకుపోయి. గురువారం మూడో రోజు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో అదే పరిస్థితి నెలకొంది. గురువారం ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభప్రారంభం కాగానే ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభా కార్యకలాపాల్లో భాగంగా ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. దీంతో వెంటనే ప్రతిపక్ష పార్టీల సభ్యులు తమ స్థానాల్లో లేచి నినాదాలు ఇచ్చుకుంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు.
అదానీ వ్యవహారంపై చర్చ జరపాలని, ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో విచారణ జరపాలని, ప్రధాని మోడీ నోరు విప్పాలని, ప్రభుత్వం వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వెంటనే సభను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ పున్ణప్రారంభమైన తరువాత కూడా ఎటువంటి మార్పు రాలేదు. దీంతో లోక్‌సభను నేటీ (శుక్రవారం)కి వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అమెరికాలో అదానీ సంస్థపై కేసుకు సంబంధించి చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో సభ గందరగోళం నెలకొంది. చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభలు పున్ణప్రారంభమైన తర్వాత కూడా సభలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో సభను నేటీకి వాయిదా వేశారు.