- మేజిస్ట్రేట్ విచారణలో నిర్థారణ
ముంబయి : బద్లాపూర్ పాఠశాల లైంగిక వేధింపుల కేసులో నిందితుడు అక్షరు షిండే మరణించడానికి ఐదుగురు పోలీసులే కారణమని మేజిస్ట్రేట్ విచారణ నిర్ధారించింది. ఈ మేరకు బాంబే హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో నివేదికను సమర్పించింది. థానే క్రైం బ్రాంచ్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంజరు షిండే, అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నీలేష్ మోరే, హెడ్ కానిస్టేబుళ్లు అభిజిత్ మోరే, హరీష్ తవడే, పోలీస్ డ్రైవర్ బాధ్యులుగా నివేదికలో పేర్కొన్నారు. అక్షరు షిండేను బూటకపు ఎన్‌కౌంటర్‌లో హత్య చేశారని ఆరోపిస్తూ అతని తండ్రి అన్నా షిండే దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. మేజిస్ట్రేట్ నివేదికను జస్టిస్ రేవతి మోహితే డేరే, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన డివిజన్ బెంచ్ పరిశీలించింది. ఈ నివేదిక ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు పోలీసులకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ కేసును ఏ ఏజెన్సీ దర్యాప్తు చేస్తుందో రెండు వారాల్లోగా తెలియజేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హితేన్ వెనెగాంకర్‌ను కోరింది. విచారణ నివేదిక కాపీని ప్రాసిక్యూషన్‌కు, మృతుని తండ్రి అన్నా షిండేకు కూడా అందజేయాలని ఆదేశించింది. బద్లాపూర్‌లోని ఒక పాఠశాల టాయిలెట్‌లో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో గతేడాది ఆగస్టులో పాఠశాల అటెండర్ అక్షరు షిండేను అరెస్టు చేశారు. తలోజా జైలు నుంచి విచారణ కోసం తీసుకెళ్తుండగా నిందితుడు వ్యాన్‌లో ఒక పోలీసు నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడని, ఎదురు కాల్పుల్లో మరణించాడని పోలీసులు చెబుతున్నారు.