ఉప ముఖ్యమంత్రి నియామకం తప్పేమి కాదు

Feb 13,2024 10:47 #Supreme Court

 సుప్రీంకోర్టు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని నియమించడం రాజ్యాంగ విరుద్ధం కాదని అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. ఇలా చేయడం వల్ల రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది. అధికార పార్టీలోని సీనియర్‌ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రిని నియమించే పద్ధతిని అవలంభిస్తున్నారని పేర్కొంది. ఉప ముఖ్యమంత్రి నియామకాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీకి చెందిన పబ్లిక్‌ పొలిటికల్‌ పార్టీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యాన్ని సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నియామకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ విలువ ప్రకారం డిప్యూటీ సిఎంల నియామకం జరుగుతుందని ధర్మాసనం తెలిపింది. ముఖ్యమంత్రి పరిధిలో ఉండే మంత్రిమండలిలో డిప్యూటీ సిఎంలు భాగమని కోర్టు పేర్కొన్నది. ‘ఉప ముఖ్యమంత్రి పదవి ప్రభుత్వంలో మొదటిది మాత్రమే కాకుండా అత్యంత ముఖ్యమైనది. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించదు. ఆర్టికల్‌ 14 (సమానత్వ హక్కు)ను ఉప ముఖ్యమంత్రి పదవి ఉల్లంఘిస్తోందని పేర్కొన్న పిటిషన్‌లో వాస్తవం లేదు. ముఖ్యమంత్రికి సహాయం చేయడానికి, సీనియర్‌ నాయకులను మంత్రివర్గంలో ఉంచేందుకు ఉప ముఖ్యమంత్రులను నియమిస్తారు. పేరుకు డిప్యూటీ సీఎం అని పిలిచినప్పటికీ ఆయన కూడా మంత్రివర్గంలో ఒక మంత్రే. కొన్ని రాష్ట్రాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది ఉప ముఖ్యమంత్రులు ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఎవరూ లేరు’ అని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ అన్నారు. ప్రస్తుతం దేశంలో 14 రాష్ట్రాల్లో డిప్యూటీ సిఎంలు ఉన్నారు. దేశంలోనే అత్యధిక (ఐదుగురు) ఉప ముఖ్యమంత్రులను కలిగి ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.

➡️