రూపాయి రాక…పోక

న్యూఢిల్లీ : ప్రభుత్వ ఖజానాకు చేరే ప్రతి రూపాయిలోనూ 66 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారానే సమకూరుతున్నాయని కేంద్ర బడ్జెట్‌ పత్రాలు చెబుతున్నాయి. 24 పైసలు అప్పుల ద్వారా వస్తుండగా 9 పైసలు పెట్టుబడుల ఉపసంహరణ వంటి పన్నేతర ఆదాయం నుండి జమ అవుతున్నాయి. ఒక పైసా రుణేతర మూలధనపు వసూళ్ల ద్వారా సమకూరుతోంది. కార్పొరేట్‌, వ్యక్తిగత ఆదాయ పన్ను సహా ప్రత్యక్ష పన్నుల రూపంలో 39 పైసలు వస్తున్నాయి. ఆదాయపన్ను ద్వారా 22 పైసలు, కార్పొరేట్‌ పన్ను ద్వారా 17 పైసలు ఖజానాకు జమ అవుతున్నాయి.
పరోక్ష పన్నులకు సంబంధించి ప్రతి రూపాయి ఆదాయంలోనూ గరిష్టంగా 18 పైసలు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా వస్తున్నవే. రూపాయిలో ఎక్సైజ్‌ సుంకం ద్వారా ఐదు పైసలు, కస్టమ్స్‌ సుంకం ద్వారా నాలుగు పైసలు ఆర్జించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక వ్యయం విషయానికి వస్తే ప్రతి రూపాయి రాబడిలోనూ 20 పైసలు వడ్డీ చెల్లింపులకే ఖర్చవుతున్నాయి. పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా 22 పైసలు. రక్షణ రంగానికి ఎనిమిది పైసలు కేటాయించారు. ప్రతి రూపాయి రాబడిలోనూ కేంద్ర రంగ పథకాల అమలు కోసం 16 పైసలు ఖర్చు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కోసం 8 పైసలు ఖర్చవుతాయి. ‘ఆర్థిక కమిషన్‌, ఇతర బదిలీల’ కోసం 8 పైసలు కేటాయించారు. సబ్సిడీలకు 6 పైసలు, పెన్షన్లకు 4 పైసలు ఖర్చు చేస్తారు. ఇతర ఖర్చుల కోసం ప్రతి రూపాయి ఆదాయంలోనూ 8 పైసలు కేటాయించారు.

➡️