సిబిఐ దర్యాప్తునకు మహిళా సంఘాల డిమాండ్
ఇండియా న్యూస్‌నెట్‌వర్క్ – న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఒక హౌటల్‌లో పనిచేస్తూ హత్యకు గురైన అంకిత కేసులో సదరు హోటల్ యజమాని బంధువు, బిజెపి నేతకు ప్రమేయమున్నట్లు విమర్శలొస్తు న్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి కేసును అప్పగించి యువతి కుటుంబానికి న్యాయం చేయాలని జాతీయ మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని, పోలీసులు, ఉన్నత స్థాయిలోని రాజకీయ నేతలు ఎవరి ప్రమేయం వుండరాదని ఆ సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు ఐద్వా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు, ఎఐపిడబ్ల్యుఎ, ఎఐఎంఎస్‌ఎస్, పిఓడబ్ల్యు, పిఎంఎస్, ఐజెఎం సమన్వయ సంస్థలు ఒక సంయుక్త ప్రకటన జారీ చేశాయి.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఒక హౌటల్‌లో పనిచేస్తున్న అంకిత అనే యువతి హత్యకు గురైంది. ఆమె పనిచేస్తున్న హౌటల్ బిజెపి నేతకు సన్నిహిత బంధువుది. హౌటల్‌కు వచ్చిన ఒక విఐపి అతిథికి తనను ప్రత్యేకంగా సేవలందించాల్సిందిగా ఆదేశించారని, దానికి తాను తిరస్కరించానని ఆ యువతి తన స్నేహితుడికి తెలియచేసింది. ఈ నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులతో ఆమె తీవ్రంగా భయాందోళనలకు గురై తనను త్వరగా వచ్చి హౌటల్ నుండి తీసుకెళ్ళాల్సిందిగా వాట్సాప్ చాట్‌లో తన స్నేహితుడిని కోరింది. అయితే ఆ విఐపి అతిథి ఎవరో పోలీసులు వెల్లడించలేదు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, స్థానిక ఎంఎల్‌ఎ ఆదేశాలతో హౌటల్‌లో ఆమె వున్న గదిని, మరికొన్ని భాగాలను కూలగొట్టారు. ఇంత జరిగినా పోలీసులు ఆమె వాట్సాప్ చాట్‌ను కాని, ఇతర సాక్ష్యాధారాలను కానీ పట్టించుకోలేదు. చార్జిషీట్‌లో నమోదు చేయలేదు. హౌటల్ రూమ్‌ను, ఇతర సాక్ష్యాధారాలను నాశనం చేయడం చూస్తుంటే సామాన్య మహిళలపై లైంగిక హింసతో సహా అనేక రకాల దాష్టికాలకు పాల్పడిన ఉన్నత స్థాయి వ్యక్తులు వాటినుండి తప్పించుకున్న గత కాలపు సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని ఆ ప్రకటనలో మహిళా సంఘాలు పేర్కొన్నాయి. సిబిఐ దర్యాప్తు జరిగితే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయనే ఆశతో అంకిత కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని, కానీ అక్కడ కూడా నిరాశే ఎదురైందని ఆ ప్రకటన పేర్కొంది. కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ పరిస్థితుల్లో తక్షణమే సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. నిర్దిష్ట కాలపరిమితిలో సక్రమంగా, శాస్త్రీయమైన రీతిలో దర్యాప్తు జరగాలని ఇది దేశ ప్రజలకు గల హక్కని పేర్కొన్నాయి. ఈ హక్కును దేశ అత్యున్నత న్యాయస్థానం పరిరక్షించాలని కోరాయి.
