బస్సుపై ఉగ్రదాడి కేసు ఎన్‌ఐఎకు అప్పగింత

న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌లో ప్రయాణీకుల బస్సుపై ఉగ్రదాడి కేసును విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం అప్పగించింది. ఈ నెల 9న జమ్ముకాశ్మీర్‌లోని రైసీ జిల్లాలో బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డంతో బస్సు లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది మరణించగా, 41 మంది గాయపడ్డారు. బస్సులోని ప్రయాణికులంతా ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన వారు. ఈ కేసు విచారణను ఎన్‌ఐఎకు అప్పగించినట్లు ఈ సంస్థకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. జమ్ముకాశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపైనా, అమర్‌నాథ్‌ యాత్రకు సన్నద్ధతా ఏర్పాట్లపైనా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రెండు వరస సమీక్షా సమావేశాలు నిర్వహించిన తరువాత రోజే ఈ నిర్ణయం వెలువడ్డం విశేషం. బస్సుపై ఉగ్రదాడితోపాటు జమ్ముకాశ్మీర్‌లో ఇటీవల కాలంలో మరికొన్ని ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో అమిత్‌ షా ఈ సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 11న భదేర్వాలోని ఒక పోలీస్‌ అవుట్‌ పోస్టుపైనా, ఈ నెల 12న దోడా జిల్లాలో గండో ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న భద్రతా సిబ్బంది బృందంపైనా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ నెల 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జమ్ముకాశ్మీర్‌లో పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

➡️