నిధులను విడుదల చేయకుండా కేంద్రం మనల్ని మోసం చేసింది : తమిళనాడు ఆర్థికమంత్రి తంగం తెన్నరసు

చెన్నై : కేంద్రం మనల్ని మోసం చేసిందని.. అందుకే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు సొంత నిధులను కేటాయిస్తున్నట్లు తమిళనాడు ఆర్థికమంత్రి తంగం తెన్నరసు అన్నారు. నేడు ఆయన అసెంబ్లీలో తమిళనాడు డిఎంకె ప్రభుత్వ ఐదవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్రం బలవంతంగా తమిళనాడుపై త్రిభాషా విధానాన్ని, ఎన్‌ఇపిని అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ విధానాలను డిఎంకె ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో విద్య కోసం ప్రభుత్వ పాఠశాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులను ఉపయోగిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
కాగా, ఆర్థికమంత్రి తెన్నరసు బడ్జెట్‌ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులపై స్వల్పంగానైనా ప్రభావం పడకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరుల నుండి ఉపాధ్యాయుల జీతాలతో సహా నిధులను కేటాయించిందని ప్రకటించారు. ఎన్ని సవాళ్లు ఎదురైన్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ద్విభాషా విధానానికే కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘సమగ్ర శిక్ష’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలుగా వివిధ విద్యార్థుల సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది అని ఆయన అన్నారు.
త్రిభాషా విధానాన్ని, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలును అంగీకరించనుందన ఈ సంవత్సరం 2,152 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయకుండా కేంద్రం మనల్ని మోసం చేసింది. కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేయనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వమే పాఠశాల విద్యార్థుల సంక్షేమం కోసం, ఉపాధ్యాయుల జీతాలు, ఇతర ఖర్చుల కోసం తన సొంత నిధులను కేటాయిస్తోంది. కేంద్రం నుంచి రెండువేల కోట్లను కోల్పోయినప్పటికీ ద్విభాషా విధానానికే కట్టుబడి ముఖ్యమంత్రి మద్దతుగా నిలుస్తాము అని ఆయన ప్రసంగంలో పేర్కొన్నారు.
ద్విభాషా విధానాన్ని అనుసరించడం ద్వారా తమిళనాడు.. తమిళ సంస్కృతిని కాపాడుకోవడమే కాకుండా.. యువతకు ఆంగ్ల ప్రావీణ్యం కల్పించి ప్రపంచవేదికపై ఎదగడానికి సాధికారత కల్పించింది అని ఆయన అన్నారు.
విద్యాభివృద్ధికి ప్రాథమిక అక్షరాస్యతను పెంపొందించడానికి ‘ఎన్నుమ్‌ ఎజుతుమ్‌ తిట్టం’ వంటి కార్యక్రమాలు చేపట్టామని ఆర్థికమంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే వికలాంగ పిల్లలకు ప్రత్యేక విద్య, దూర ప్రాంతాల విద్యార్థులకు రవాణా ఖర్చులు, ఉపాధ్యాయులకు జీతాలు, విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉన్నత విద్యకు మార్గదర్శకత్వం, ప్రత్యేక ప్రతిభను పెంపొందించడానికి కళా ఉత్సవాలు, విద్యా పర్యటనలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యాలను కల్పించనున్నట్లు తంగం తెన్నరుసు తెలిపారు.

➡️