కేంద్రం గొడ్డలి పోటేస్తున్నాడివిడెండ్ల పంట

Dec 6,2024 04:55 #generate huge revenue, #modi, #PSUs
  • ప్రతికూల పరిస్థితుల్లోనూ భారీ ఆదాయాన్ని సమకూర్చిన పిఎస్‌యులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ : కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించే ఎత్తులతో గొడ్డలి పోటేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వానికి ఆ సంస్థలు పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 42,713 కోట్ల రూపాయలను డివిడెండ్ల రూపంలో ఆ సంస్థలు కేంద్రానికి అందించాయి. ఇది వార్షిక లక్ష్యంలో 76 శాతం కావడం గమనార్హం. దీంతో ఈ ఏడాది కూడా ఈ సంస్థలు లక్ష్యాలు మించి ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఒకదాని తరువాత ఒకటిగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు విషయంలో అనుసరిస్తున్న వైఖరే దీనికి నిదర్శనం. ఉక్కు కార్మికులతో పాటు, రాష్ట్ర ప్రజానీకం అంతా ఏళ్లతరబడి వ్యతిరేకిస్తున్నా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. రెండు రోజుల క్రితం కూడా కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌ డి కుమారస్వామి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగదని పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే. సొంత గనులు, అవసరమైన నిధులు సమకూర్చకుండా విశాఖ ఉక్కును నష్టాల బాట పట్టించడానికి కుట్ర ఒకవైపు జరుగుతుంటే, మరోవైపు కార్మికులు సంఘటితంగా ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను సృష్టిస్తూ విశాఖ ఉక్కు ప్రతిష్టను నిలబెడుతున్నారు. మన రాష్ట్రంలోనూ కాదు, దేశ మంతా ఇదే పరిస్థితి ఉందనడానికి నిదర్శనమే తాజా గణాంకాలు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పటికప్పుడు లాభాలను ఆర్జించి నిధులు సమకూరుస్తుంటే, కేంద్రం మాత్రం బంగారు గుడ్లు పెట్టే బాతును చంపినట్లు వాటిని తెగనమ్మడానికి ప్రయత్నిస్తోంది.

ప్రతికూలతను అధిగమించి…

అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికల పరిస్థితులను అధిగమించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ ఆయిల్‌, గ్యాస్‌ సంస్థలు భారీ ఆదాయాన్ని ఆర్జించాయి. ఫలితంగా ప్రభుత్వానికి అత్యధిక డివిడెండ్లను చెల్లించిన పిఎస్‌యులలో ఈ సంస్థలు అగ్ర భాగాన నిలిచాయి. ఈ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 14,387 కోట్లరూపాయల డివిడెండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాయి. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఒఎన్‌జిసి) 6,297కోట్లు, ఇండియన్‌ ఆయిల్‌ 5,091 కోట్ల రూపాయలను చెల్లించగా, భారత పెట్రోలియం కార్పొరేషన్‌ 2,413 కోట్ల రూపాయలను చెల్లించాయి. పెట్రోలియం సంస్థల తరువాత స్థానంలో మైనింగ్‌ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఈ రంగం నుండి దాదాపుగా 12,114 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమఅయ్యాయి. కోల్‌ ఇండియా నుండి అత్యధికంగా 8,073 కోట్ల రూపాయలు డివిడెండ్‌గా ప్రభుత్వానికి చేరాయి. అత్యధిక మొత్తంలో డివిడెండ్‌ను చెల్లించిన ప్రభుత్వ సంస్థగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోల్‌ ఇండియా నిలిచింది. 29.54శాతం ప్రభుత్వ వాటా ఉన్న హిందుస్థాన్‌ జింక్‌ సంస్థ ఒక్కటే 3,619కోట్ల రూపాయల డివిడెండ్‌ను ప్రభుత్వానికి అందచేసింది. టెలికమ్యూనికేషన్స్‌కు చెందిన టిసిసిఐ నుండి 3,443 కోట్ల రూపాయలు కేంద్రానికి అందాయి.

60 వేల కోట్లు దాటుతాయా…?

గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల నుండి 50 వేల కోట్ల రూపాయల డివిడెండ్‌ వస్తుందని అంచనా వేయగా, 63,749 కోట్ల రూపాయలు కేంద్ర ఖజానాకు చేరాయి. ఇది ఇప్పటి వరకు డివిడెండ్ల రూపంలో చేరిన అత్యధిక మొత్తం. దీనిని ఒక రికార్డుగా ఆర్థికశాఖ పేర్కొంది. తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది కూడా 60వేల కోట్ల రూపాయల దాటి డివిడెండ్లు వస్తాయని, గత సంవత్సరపు రికార్డును బద్దలు కొట్టే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది 56,260 కోట్ల రూపాయలు ఈ సంస్థల నుండి కేంద్రానికి చేరతాయని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వానికి భారంగా మారుతున్న ద్రవ్యలోటును అదుపులో ఉంచడానికి కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుండి వస్తున్న నిధులు ఉపయోగపడుతున్నాయి.

➡️