అవినీతి ప్రభుత్వాన్ని కూల్చాలి : రామ్‌లీలాలో వక్తల పిలుపు

న్యూఢిల్లీ : అత్యంత అవినీతికరమైన బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించి, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

అత్యంత అవినీతికర పార్టీగా బిజెపి : దీపాంకర్‌ ముఖర్జీ
సిపిఐ(ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ ముఖర్జీ మాట్లాడుతూ.. ఎలక్టోరల్‌ బాండ్ల స్కామ్‌ దేశం ఇప్పటి వరకు చూడని అతిపెద్ద కుంభకోణమని అన్నారు. ”ప్రభుత్వాలను పడగొట్టి, కార్పొరేట్ల నుంచి బాండ్ల ద్వారా సంపాదించిన రూ.కోట్లతో ఎంపిలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ధరకు అమ్మడుపోని వారిని నకిలీ కేసుల్లో ఇరికించి జైలు పాలు చేస్తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నే నాశనం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఎలక్టోరల్‌ బాండ్లతో బిజెపి దేశంలోనే అతిపెద్ద అవినీతి పార్టీగా అవతరించింది. మోడీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వంగా మారిందన్నారు. ఎన్నికల్లో అవినీతి ప్రభుత్వాన్ని కూల్చాలి” అని పిలుపునిచ్చారు.

ప్రధాని చేసింది సరైందేనా? : ప్రజలను ప్రశ్నించిన కేజ్రీవాల:్‌ సతీమణి సునీత
‘నా భర్తను మన ప్రధాని నరేంద్ర మోడీ జైలుకు పంపారు. ప్రధాని చేసినది సరైన పనేనా? కేజ్రీవాల్‌ నిజమైన దేశభక్తుడు, నిజాయతీ పరుడని మీరు విశ్వసిస్తున్నారా? ఈ బిజెపి వాళ్లు కేజ్రీవాల్‌ జైలులో ఉన్నారని, రాజీనామా చేయాలని అంటున్నారు. ఆయన రాజీనామా చేయాలా? మీ కేజ్రీవాల్‌ ఒక సింహం. వాళ్లు ఎంతోకాలం ఆయనను జైలులో ఉంచలేరు” అని సభికులను ఉద్వేగించి ఉద్వేగంగా సునీత ప్రసంగించారు.
ఝార్ఖండ్‌ తలవంచబోదు, ఇండియా ఫోరం కూడా తలవంచబోదు : హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌
ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌ మాట్లాడుతూ ”రెండు నెలల క్రితం, హేమంత్‌ సోరెన్‌ను జైలులో పెట్టారు. ఇప్పుడు, నియంతను నిర్మూలించాల్సిన అవసరం ప్రజలపై ఉంది. ఝార్ఖండ్‌ తలవంచబోదు. ఇండియా ఫోరం కూడా తలవంచబోదు” అని ఆమె స్పష్టం చేశారు.

బిజెపిని చిత్తుగా ఓడించాలి : ఫరూక్‌ అబ్దుల్లా
రాజ్యాంగాన్ని పరిరక్షించడమే తమ లక్ష్యమని, తుదిశ్వాస విడిచే వరకు ఇండియాతోనే ఉంటుందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. ”అన్ని మతాల వారు కలసిమెలసి ఉండే పరిస్థితి లేదు. ఈ విపత్కర పరిస్థితికి వ్యతిరేకంగా మనమంతా కలిసి గళం ఎత్తుదాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ముప్పు పొంచి ఉంది. ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించాలి” అని అన్నారు.

సెంట్రల్‌ ఏజెన్సీలు బిజెపి సెల్స్‌ : తేజస్వి యాదవ్‌
ఇడి, సిబిఐ, ఐటి వంటి కేంద్ర సంస్థలు బిజెపికి స్లీపర్‌ సెల్స్‌ లాంటివని ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్‌ విమర్శించారు. ”వారు తల్లిదండ్రులు, సోదరీమణులు, బంధువులను కూడా వేటాడారు. వారు సింహాలను బోనులో బంధిస్తారు. మనమంతా సింహాలమే. దేశం అప్రకటిత ఎమర్జెన్సీని ఎదుర్కొంటోంది. బిజెపి అహంకారపూరితంగా మారింది. అతిపెద్ద సమస్య ద్రవ్యోల్బణం, నిరుద్యోగం. ప్రియాంక చోప్రా, బిల్‌ గేట్స్‌లను కలవడానికి సమయం దొరికిన మోడీ.. రైతులను కలవడానికి వెళ్లడం లేదు” అని విమర్శించారు.

అధికారం శాశ్వతం కాదు: ప్రియాంక
అధికారం శాశ్వతం కాదు, వచ్చి పోతుందని మోడీకి శ్రీరాముడు ఇచ్చిన సందేశాన్ని ప్రియాంక గాంధీ గుర్తుచేశారు.
ఒకే పార్టీ, ఒకే వ్యక్తి ప్రభుత్వం దేశానికి ప్రమాదం: ఉద్ధవ్‌ థాకరే
ఒకే వ్యక్తి, ఒకే పార్టీ ప్రభుత్వం దేశానికి ప్రమాదమని, దేశాన్ని నియంతృత్వం దిశగా తీసుకెళ్తోందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే విమర్శించారు. ఒక పార్టీ, ఒక వ్యక్తి సారధ్యంలో నడిచే ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అవినీతిపరులతో నిండిపోయిన బిజెపి ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుందని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన బాధ్యత : శరద్‌ పవర్‌
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన బాధ్యతని ఎన్‌సిపి చీఫ్‌ శరద్‌ పవార్‌ అన్నారు. ‘ఇద్దరు సిఎంలను, పలు రాష్ట్రాల నాయకులను జైలులో పెట్టడం ప్రజాస్వామ్యంపైనా, రాజ్యాంగంపైనా దాడి. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత” అని అన్నారు.

మోడీ ప్రభుత్వం అత్యంత అవినీతిమయం: మెహబూబా ముఫ్తీ
పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమని విమర్శించారు. సరైన విచారణ లేకుండానే వ్యక్తులను నిర్బంధిస్తున్నారని, ఇది ‘కలియుగ్‌ కా అమృత్‌ కాల్‌’ను పోలి ఉంటుందని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యం, సంస్థల రక్షణ విషయంలో మోడీ ప్రభుత్వం జీరో వారెంటీ: డెరెక్‌ ఓబ్రెయిన్‌
టిఎంసి నేత డెరెక్‌ ఓబ్రెయిన్‌ మాట్లాడుతూ టిఎంసి ఇండియా ఫోరంలో భాగంగానే ఉందని, ఎప్పటికీ ఉంటుందని అన్నారు. ప్రజాస్వామ్యం, సంస్థల రక్షణ విషయంలో మోడీ ప్రభుత్వం జీరో వారెంటీ ఇస్తుందని విమర్శించారు.

దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి: అని గోపాల్‌ రాయ్
కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన మార్చి 21 తరువాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని ఢిల్లీ మంత్రి, ఆప్‌ నేత గోపాల్‌ రారు అన్నారు. నిజం గెలుస్తుందని మరో మంత్రి కైలాష్‌ గహ్లౌట్‌ అన్నారు. జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ భార్య పూనమ్‌ జైన్‌ కూడా ర్యాలీకి హాజరయ్యారు.

➡️