ఈ దేశపు కుమార్తెలు ఓడిపోయారు

  •  బ్రిజ్‌భూషణ్‌ కుమారుడికి బిజెపి టిక్కెట్‌పై రెజ్లర్ల ఆవేదన
  •  ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా? సాక్షి మాలిక్‌
  •  ఈ దేశ దౌర్భాగ్యం : బజరంగ్‌ పునియా

న్యూఢిల్లీ : బిజెపి నిర్ణయం ముందు ఈ దేశంలోని కుమార్తెలు ఓడిపోయారని అంతర్జాతీయ రెజ్లర్లు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా ఆవేదన వ్యక్తం చేశారు. రెజ్లర్లపై డబ్ల్యుఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక వేధింపులకు పాల్పడినప్పటికీ, ఆయన కుమారుడు కరణ్‌భూషణ్‌ సింగ్‌ను ఉత్తర ప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ లోక్‌సభ అభ్యర్థిగా బిజెపి ప్రకటించడంపై వారు మండిపడ్డారు. శుక్రవారం ఎక్స్‌ వేదికగా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సాక్షి మాలిక్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అరెస్ట్‌ సంగతి పక్కన పెట్టండి. ఈ రోజు అలాంటి వ్యక్తి కుమారుడికి బిజెపి టిక్కెట్‌ ఇచ్చి దేశంలోని కోట్లాది మంది కుమార్తెల మనోధైర్యాన్ని దెబ్బతీశారు. ఆ కుటుంబానికే టికెట్‌ ఇచ్చారంటే, అతని ముందు దేశ ప్రభుత్వం ఇంత బలహీనంగా ఉందా! ఓట్ల కోసమే శ్రీరాముడి పేరు అవసరం. ఆయన చూపిన మార్గం సంగతి ఏమిటి?’ అని ప్రశ్నించారు.
మన దేశ దౌర్భాగ్యం : బజరంగ్‌ పునియా
‘పతకాలు సాధించిన కుమార్తెలను వీథుల్లోకి లాగడం, కుమార్తెలను లైంగికంగా వేధించిన వ్యక్తి కుమారుడికి టిక్కెట్‌ ఇచ్చి గౌరవించడం మన దేశ దౌర్భాగ్యం’ అని మరోక ప్రముఖ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా ఆవేదన వ్యక్తం చేశారు. ‘లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు ఉన్న బిజెపిని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీల్లో ఒకటిగా పరిగణిస్తారు. అయితే ఇలాంటి బిజెపి కూడా ప్రజ్వల్‌ రేవణ్ణ వంటి సమస్య చుట్టుముట్టిన సమయంలోనూ బ్రిజ్‌భూషణ్‌ కుమారుడికి టిక్కెట్‌ ఇచ్చింది’ అని బజరంగ్‌ పునియా ఎక్స్‌ ఖాతాలో విమర్శించారు. ‘పంజాబ్‌, హర్యానాల్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో ప్రజలు ‘ప్రభుత్వాల నుంచి ఏమీ ఆశించవద్దు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’ అని మాత్రమే నినదించారు’ అని పునియా గుర్తు చేశారు.

➡️