- బోర్డుపై ఒకే పేరుండడం కారణమని రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక
- 18కి చేరిన ఢిల్లీ దుర్ఘటన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ : ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటపై విచారణ ప్రారంభమైంది. ఇద్దరు సభ్యులతో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఆదివారం నుంచే తన పనిని ప్రారంభించిందని రైల్వే శాఖ తెలిపింది ఈ నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తర రైల్వే సీపీఆర్‌ఓ హిమాన్షు శేఖర్ ఉపాధ్యారు తెలిపారు. అలాగే ఈ ఘటనపై రైల్వే శాఖ ఆదివారం ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న రైళ్ల పేర్లు ఒక విధంగా ఉండటమే ఈ తొక్కిసలాటకు కారణంగా ఈ నివేదిక తెలపడం విశేషం. శనివారం రాత్రి రెగ్యులర్‌గా నడిచే ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రావడం కొంత ఆలస్యమైందని, ఈ రైలు కోసం 14వ ప్లాట్‌ఫామ్‌పై భారీ సంఖ్యలో ప్రయాణీకులు వేచి ఉన్నారని తెలిపింది. అయితే ఈ సమయంలోనే 12వ ప్లాట్‌ఫామ్‌పై ప్రయాగ్‌రాజ్ ప్రత్యేక రైలును ప్రకటించారని పేర్కొంది. దాని పేరు కూడాఒకేలా ఉండటంతో ఆ రైలునే తాము ఎక్కాల్సినదిగా భ్రమించి అక్కడకు వెళ్లేందుకు ఒక్కసారిగా చాలా మంది కదలడంతో తొక్కిసలాట జరిగిందని ప్రాథమికి నివేదిక పేర్కొంది.
సరైన ఏర్పాట్లు లేకపోవడంతోనే : ఢిల్లీ పోలీసులు
భారీగా ప్రయాణికులు ఉన్నా సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో దాదాపు 2600 టిక్కెట్లను సిబ్బంది విక్రయించారని, ఫలితంగా స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసి పోయిందని, అదుపు చేయడం కష్టమైందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. మరో 15 మంది గాయపడ్డారు. మృతదేహాలను, క్షతగాత్రులను లోక్‌నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పగాయాలైనవారికి రూ.లక్ష ఇస్తామని తెలిపింది.