కేంద్ర మంత్రి అఫిడవిట్‌పై దర్యాప్తు

  •  నిజానిజాల నిగ్గు తేల్చండంటూ సిబిడిటిని ఆదేశించిన ఇసి
  • 2021లో మంత్రి ఆదాయం 680 రూపాయలేనట!
  • జూపిటర్‌ కేపిటల్‌ కంపెనీ ఊసే లేదు
  • సిపిఐ(ఎం), కాంగ్రెస్‌ వేర్వేరుగా ఫిర్యాదు

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ : తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారంటూ ఫిర్యాదులు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది. అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలకు, కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అసల ఆస్తుల విలువకు తేడా ఏమైనా ఉన్నదీ లేనిదీ పరిశీలించి చెప్పాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి)ని ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశించింది. మంత్రి తన ఆస్తిపాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను అఫిడవిట్‌లో పేర్కొనకుండా దాచిపెట్టారని అంతకుముందు సిపిఐ(ఎం), కాంగ్రెస్‌ వేర్వేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. 2021లో తన ఆదాయం కేవలం రూ.680 మాత్రమేనని కేంద్ర మంత్రి ఆ అఫిడవిట్‌లో పేర్కొనడంపై ఈ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు, జుపిటర్‌ కేపిటల్‌ హోల్డింగ్‌ కంపెనీకి వ్యవస్థాపకుడిగా ఆ కంపెనీ తన వెబ్‌సైట్‌లో స్పష్టంగా పేర్కొంటుండగా, ఆయన అఫిడవిట్‌లో ఆ కంపెనీ గురించిన ప్రస్తావనే లేదు. తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ను సమర్పించినట్లైతే ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 125ఎ కింద కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి వుంటుంది. నామినేషన్‌ పత్రాల్లో లేదా అఫిడవిట్‌లో సమాచారం దాచిపెట్టిన పక్షంలో ఆరు మాసాల వరకు జైలు శిక్ష, లేదా జరిమానా లేదా రెండూ వర్తిస్తాయి. ఈ నెల 5న చంద్రశేఖర్‌ తనకు రూ.28కోట్ల విలువ చేసే ఆస్తులు వున్నట్లు నామినేషన్‌తోబాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చరాస్తుల విలువ రూ.13,69,18,637 కోట్లు కాగా, ఆయన భార్య ఆస్తుల విలువ రూ.12,47,00,408కోట్లుగా వుంది. ఇందులో చేతిలో వున్న నగదు, బ్యాంకుల్లో డిపాజిట్ల వివరాలు, బ్యాంకింగేతర ఫైనాన్షియల్‌ కంపెనీలు, సహకార సొసైటీలు, అలాగే బాండ్ల రూపంలో పెట్టుబడులు, డిబెంచర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ల్లో, కంపెనీల్లో యూనిట్లు, షేర్లు, ఇతర ఆర్థికపరమైన పెట్టుబడులు వున్నాయి. అలాగే ఆయన చరాస్తుల్లో 1942 మోడల్‌ రెడ్‌ ఇండియన్‌ స్కౌట్‌ కారు కూడా వుంది. కర్ణాటకలో రిజిస్టర్‌ అయిన ఈ వాహనాన్ని 1994లో రూ.10వేలకు కొనుగోలు చేశారు. రూ.3.25కోట్ల విలువ చేసే బంగారం, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు వున్నాయి. ఇక స్థిరాస్తుల్లో రూ.5,26,42,640కు కొనుగోలు చేసిన స్థిరాస్తి వుంది. దీని ప్రస్తుత మార్కెట్‌ విలువ దాదాపు రూ.14,40,00,000గా వుంది. ఇవి కాకుండా అదనంగా ఆయనకు, భార్యకు వివాదంలో వున్న కొన్ని ఆస్తులు వున్నాయి. చంద్రశేఖర్‌కు రూ.19,41,92,894, ఆయన భార్యకు రూ.1,63,43,972 మేరా అప్పులు వున్నాయి. వీటిల్లో బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలు, తదితరాల నుండి తీసుకున్న రుణాలు కూడా వున్నాయి. 2022-23లో తన ఆదాయ పన్ను రిటర్న్స్‌లో తన మొత్తం ఆదాయం రూ.5,59,200గా వున్నట్లు చంద్రశేఖర్‌ చెప్పారు. కానీ, 2021-22లో ఈ మొత్తం కేవలం రూ.680గా వుంది.
ఏడేళ్ళలో వంద శాతం పడిపోయిన ఆదాయం
2016-17, 2022-23 మధ్య కాలంలో రాజీవ్‌చంద్రశేఖర్‌ వార్షిక ఆదాయం దాదాపు వంద శాతమూ కుంచించుకుపోగా, ఆయన భార్య అంజు చంద్రశేఖర్‌ ఆదాయం ఏకంగా 500శాతం పెరిగింది. 2018లో రాజ్యసభ, 2024లో లోక్‌సభ ఎన్నికలకు గానూ ఆయన సమర్పించిన అఫిడవిట్ల వివరాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
2018, 2024 మధ్య కాలంలో ఆయన చరాస్తుల విలువ 66శాతం మేరా అంటే రూ.27.98కోట్లు నుండి రూ.9.25కోట్లకు తగ్గిపోయింది. అదే సమయంలో ఆయన అప్పులు సున్న నుండి రూ.19.41కోట్లకు పెరి గాయి. ఏడు ఆర్థిక సంవత్సరాల్లో చంద్రశేఖర్‌ ఆదాయం రూ.28కోట్ల నుండి రూ.5.5లక్షలకు పడిపోయినట్లు ఆదాయపన్ను రిటర్న్స్‌ వివరాలు తెలుపుతున్నాయి. అదే సమయంలో ఆయన భార్య ఆదాయం రూ.21.44 లక్షల నుండి రూ.1.2కోట్లకు పెరిగింది.
2018లో చంద్రశేఖర్‌ అందచేసిన అఫిడవిట్‌ ప్రకారం, చంద్రశేఖర్‌ స్థూల ఆదాయం రూ.28.27కోట్లు వుంది. ప్రధానంగా జూపిటర్‌ కేపిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుండి వచ్చే వేతనం, బెంగళూరులోని కోరమంగళలో గల భవనానికి వచ్చే అద్దెలు, వ్యాపారంలో వచ్చే లాభాలు, రాజ్యసభ ఎంపిగా తన వేతనం, నియోజకవర్గ అలవెన్స్‌, ఆఫీస్‌ వ్యయం కింద వచ్చే అలవెన్స్‌, రోజువారీ అలవెన్స్‌, డివిడెండ్‌ ఇన్‌కం, పన్ను రహిత బాండ్ల నుండి, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ యూనిట్ల నుండి వచ్చే వడ్డీ,. మైనర్‌ పిల్లలకు సంబంధించిన ఆదాయం, బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుండి వచ్చే వడ్డీ ఇవన్నీ కలిపి ఈ ఆదాయంగా చూపించారు.
ఆయన స్థిరాస్తుల స్థూల విలువ కూడా పొంతన లేకుండా వుంది. చరాస్తుల వివరాలను చూపించే పత్రంలో వాటి స్థూల విలువ రూ.9.25కోట్లుగా చూపించారు. కానీ మరో అనుబంధ పత్రంలో వాటి విలువ రూ.13.69కోట్లుగా చూపించారు. అంటే రూ.4.43కోట్లు తేడా వుంది. కానీ ఆయన భార్య చరాస్తుల విలువ మాత్రం ఒక్కలాగే రూ.12.47కోట్లుగా వుంది. బిజెపి అభ్యర్థి రాజీవ్‌ చంద్రశేఖర్‌ మాత్రం తన అఫిడవిట్‌ సరైనదేనని సమర్థించుకున్నారు.

➡️