తిరువనంతపురం : కాసర్‌గోడ్ జిల్లాలో బాణాసంచా పేలుడు ఘటన బాధితుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళలోని కాసరగోడ్‌లోని వీరర్కవు ఆలయంలో వార్షిక కాళియాట్లం ఉత్సవాలు నిర్వహిస్తుండగా.. ఆలయ సమీపంలో నిల్వ ఉన్న బాణా సంచా పేలింది. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. వారి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించనుందని కేబినెట్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ ఘటనకు సంబంధించి మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు నీలేశ్వర్ పోలీస్ పేర్కొన్నారు. మొత్తం అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య 4కి చేరిందని అన్నారు.
ఈ కేసును సుమోటోగా తీసుకున్నట్లు మానవ హక్కుల కమిషన్ ప్రకటించింది. ఈ ఘటనపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్‌పిలను ఆదేశించింది.