- బాధితుల ఫిర్యాదులపై సమగ్ర దర్యాప్తు
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
తిరువనంతపురం : చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిటీపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ సినీ పరిశ్రమలో జోక్యం చేసుకుని జస్టిస్ హేమ కమిటీ తరహా కమిటీలను ఏర్పాటు చేయలేదని.. కేరళలో వామపక్ష ప్రభుత్వ చొరవతోనే హేమా కమిటీ సాధ్యమైందని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ కమిటీ ముందు వాంగ్మూలాలు ఇచ్చినవారు, ఇవ్వని వారు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని, వాటిపై సమగ్రంగా దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో మహిళా వైద్యురాలిపై అత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై పెద్దయెత్తున చర్చ జరుగుతోందని ఈ సందర్భంగా విజయన్ పేర్కొన్నారు. మంగళవారం తిరువనంతపురంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన విజయన్ .. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మహిళలపై దాడులు కొనసాగుతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ ఘటనతో సమాజానికి తప్పుడు సందేశం
‘బిల్కిస్ బానో కేసులో నిందితుల విడుదల, వారికి ఘనస్వాగతం పలకడం వంటి పరిణామాలు సమాజానికి తప్పుడు సందేశాన్నిచ్చాయి. జాతీయ స్థాయిలో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మహిళల భద్రతకు భరోసా ఇచ్చేలా కచ్చితమైన విధానాలతో ముందుకెళ్తోంది. సినీ పరిశ్రమలో పలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే జస్టిస్ హేమ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో మరే ఇతర రాష్ట్రమూ ఈ తరహాలో సినీ పరిశ్రమలో జోక్యం చేసుకోలేదు. కేరళలో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో జస్టిస్ హేమ కమిటీ తరహాలో ప్యానెల్స్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు పలు రాష్ట్రాల్లో వస్తున్నాయి. కమిటీ నివేదికకు సంబంధించి న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అలాంటి ఫిర్యాదులు ఏవి వచ్చినా దర్యాప్తు వ్యవస్థ రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉంది’ అని సిఎం పినరయి విజయన్ తెలిపారు.
ఇకె నయనార్ స్మారక భవనం ప్రారంభం
సిపిఎం కోవలం ఏరియా కమిటీ కార్యాలయ భవనం ఇకె నయనార్ స్మారక భవనం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలోనూ విజయన్ ప్రసంగించారు. ఈ కార్యాక్రమాన్ని పురుస్కరించుకొని స్థానిక సిపిఎం కార్యకర్తలు సమీకరించిన నిధులతో సకల హంగులతో నిర్మించిన 11 గృహాలకు సంబంధించిన తాళాలను 11 నిరుపేద కుటుంబాలకు విజయన్ అందజేశారు.