వాయవ్య భారతంలో వచ్చే 5 రోజులూ వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలే !

May 19,2024 08:41 #Delhi, #Heatwave

న్యూఢిల్లీ : వాయవ్య భారతంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలతో వడగాడ్పులు వీస్తున్నాయి. ఈ పరిస్థితులు మరో ఐదు రోజుల పాటు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ శనివారం పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, యుపి ప్రాంతాల ప్రజలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. శుక్రవారం ఉత్తర భారతం అధిక ఉష్ణోగ్రతలను చవిచూసింది. పశ్చిమ ఢిల్లీలోని నజఫ్‌ఘర్‌లో 47.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. హర్యానాలోని సిర్సాలో 47.1 డిగ్రీలు నమోదైంది. దేశంలో ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఇదే అధికం. రాబోయే ఐదు రోజుల్లో మైదాన ప్రాంతాల్లో, వచ్చే మూడు రోజుల్లో తూర్పు, మధ్య ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు రాజస్థాన్‌, యుపి, బీహార్‌ల్లో ఆరంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మే 18 నుండి 21వ తేదీ మధ్య కనీసం ఒక రోజైనా దేశంలోని 54.3 కోట్లమంది ప్రజలు అత్యధిక ఉష్ణోగ్రతలను అనుభవిస్తారని అమెరికా కేంద్రంగా పనిచేసే క్లైమేట్‌ సెంట్రల్‌ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మానవ చర్యల ఫలితంగా తలెత్తే వాతావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమని క్లైమేట్‌ సెంట్రల్‌కి చెందిన ఆంరడూ పెర్షింగ్‌ వ్యాఖ్యానించారు. 1998-2017 మధ్య వడగాడ్పుల ఫలితంగా 1,66,000మందికి పైగా చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల కూడా ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమవుతాయి. వేడిమి, ఉక్కపోతతో కూడిన వాతావరణంలో ప్రజలు ఎక్కువగా పనిచేయలేరు, పిల్లలు నేర్చుకోవడం కూడా ఇబ్బందుల్లో పడుతుంది. సాధారణంగా మైదాన ప్రాంతాల్లో 40, తీర ప్రాంతాల్లో 37, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే అక్కడ అధికంగా నమోదైనట్లే భావిస్తారు. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 6.4డిగ్రీలు ఎక్కువైతే దాన్ని తీవ్ర వడగాడ్పుగా ప్రకటిస్తారు. అనేక ప్రాంతాల్లో ఏప్రిల్‌లోనే తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

➡️