పనిగంటల పెంపు సబబు కాదు

సమర్ధత, నాణ్యత దెబ్బతింటాయి
దేహానికి విశ్రాంతి తప్పనిసరి
డబ్ల్యూహెచ్‌ఒ మాజీ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్‌
న్యూఢిల్లీ : దీర్ఘకాల పనిగంటలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) మాజీ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనివల్ల పనిలో నాణ్యత దెబ్బతింటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఎక్కువ సేపు పనిచేయాలా? వద్దా? అనేది వ్యక్తిగత విషయమని చెప్పారు. ప్రజలు తమ శరీరం చెప్పేది వినిపించుకోవాలని, ఎప్పుడు విశ్రాంతి అవసరమో గుర్తించాలని సూచించారు. దీర్ఘకాల పనిగంటలు సమర్ధతను తగ్గిస్తాయని అన్నారు. సౌమ్యా స్వామినాథన్‌ పిటిఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ స్వల్పకాలంలో ఎక్కువసేపు పనిచేయడం సాధ్యమేనని, కోవిడ్‌ సమయంలో దీనిని చూశామని చెప్పారు. అయితే దీర్ఘకాలంలో అది మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఎన్ని గంటలు పనిచేశామన్న దానిపై కాకుండా ఎంత నాణ్యతతో పనిచేశామన్న దాని పైనే ఉత్పాదకత ఆధారపడి ఉంటుందని ఆమె తెలిపారు. మానవ ఆరోగ్యంపై దీర్ఘకాల పనిగంటల ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు సౌమ్యా స్వామినాథన్‌ సమాధానమిస్తూ ‘చాలా కష్టపడి పనిచేసే అనేక మందిని నేను చూశాను. అది వ్యక్తిగత విషయమేనని అనుకుంటాను. మీరు ఎప్పుడు అలసిపోయారో మీ శరీరం చెబుతుంది. కాబట్టి అప్పుడు మీ శరీరం చెప్పినట్లు వినాలి. మీరు కొన్ని నెలల పాటు చాలా కష్టపడి పనిచేయగలరు. కోవిడ్‌ సమయంలో మనమంతా అదే చేశాం కదా. కానీ దానిని సంవత్సరాల తరబడి కొనసాగించగలమా? చెప్పలేను’ అని అన్నారు. ‘ఆ రెండు మూడు సంవత్సరాలు కష్టపడి పనిచేశాం. ఎక్కువ సేపు నిద్ర పోలేదు. చాలా సమయం ఒత్తిడితో గడిపాం. అనేక విషయాలపై కలత చెందాం. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ కల్పించే వారి గురించి ఆలోచించాం. వాళ్లు రాత్రింబవళ్లూ పనిచేశారు. కోవిడ్‌ తర్వాత చాలామంది తమ వృత్తిని వదిలేశారు. మనం ఆ విధంగా స్వల్పకాలంలో మాత్రమే కష్టపడగలం. కానీ వాస్తవానికి అది సరికాదు’ అని చెప్పారు.
సుస్థిరమైన పనితీరు కనబరచాలంటే మానసిక ఆరోగ్యం, విశ్రాంతి అవసరమని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్‌) మాజీ డైరెక్టర్‌ జనరల్‌ కూడా అయిన అంతర్జాతీయ ఆరోగ్య నిపుణురాలు సౌమ్యా స్వామినాధన్‌ అభిప్రాయపడ్డారు. మానవ శరీరానికి నిద్ర, మానసిక ప్రశాంతత అవసరమని ఆమె తెలిపారు. ‘మీరు మీ టేబుల్‌ ముందు 12 గంటలు కూర్చోగలరు. కానీ 8 గంటల తర్వాత నాణ్యమైన పని చేయలేరు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి’ అని అన్నారు.

గతంలో ఎవరేమన్నారు?
పనిగంటలపై గతంలో ఎల్‌ అండ్‌ టి ఛైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్‌ చర్చకు తెర తీశారు. ఉద్యోగులు ఆదివారాలు సహా వారానికి 90 గంటలు పని చేయాలని ఆయన సూచించారు. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా సుబ్రమణ్యన్‌ అభిప్రాయాలతో ఏకీభవించారు. ఆయన వారానికి 70 పనిగంటలను సూచించారు. 2047 నాటికి భారత్‌ను 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలంటే భారతీయులు మరింత కష్టపడి పనిచేయాలని నీతి ఆయోగ్‌ మాజీ సిఇఒ అమితాబ్‌ కాంత్‌ సలహా ఇచ్చారు. వారానికి 80 లేదా 90 గంటలు కానివ్వండి…. లక్ష్య సాధనకు కష్టపడి పనిచేయాల్సిందే అని చెప్పారు. పని గంటలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే ఇటీవల పార్లమెంటుకు తెలిపారు.

➡️