విద్యుత్‌ రంగంలో సంస్కరణల అమలు అవశ్యం

Apr 23,2025 07:31 #Electricity Bill, #reforms

కేంద్ర ఇంధనశాఖ సహాయమంత్రి శ్రీపాద యశోనాయక్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ రంగంలో పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితి, ఇతర సమస్యలను అధిగమించడానికి సంస్కరణలు అమలు ఆవశ్యకమని కేంద్ర ఇంధనశాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్‌ పేర్కొన్నారు. విద్యుత్‌ సంస్కరణలపై విద్యుత్‌శాఖ మంత్రుల 4వ సమావేశం విజయవాడలోని ఓ హోటల్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా యశో నాయక్‌ మాట్లాడుతూ.. టారిఫ్‌ల సమీక్షతో పాటు ఎపిటిఇఎల్‌ వంటి సంస్థలను బలోపేతం చేయడం, టారిఫ్‌ ఆర్డర్లు, నెట్‌ మీటరింగ్‌ విధానాలను సరళీకృతం చేయడం వంటి చర్యలతో డిస్కమ్‌లను నష్టాల నుంచి గట్టెక్కించవచ్చని సూచించారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ విధానం విస్తరణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ మాట్లాడుతూ.. డిస్కమ్‌లను ఆర్థికంగా పరిపుష్టంగా చేసేందుకు, సుస్థిరాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. రాజస్థాన్‌ విద్యుత్‌శాఖ మంత్రి హీరా లాల్‌ నగర్‌ మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో పిఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజనతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36,700 మెగావాట్ల రూప్‌ టాప్‌ సోలార్‌ సామర్ధ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 77 లక్షల మంది వినియోగదారులకు నెలకు 150 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర మంత్రి మేఘన దీపక్‌ సకోరే బోర్డికర్‌ మాట్లాడుతూ.. మహావితరణ సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందన్నారు. ఉత్తర ప్రదేశ్‌ విద్యుత్‌శాఖ మంత్రి అరవింద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. అధిక ఉత్పత్తి ఖర్చులను తగ్గించాలని, బొగ్గు కేటాయింపులను సరైన కార్యాచరణ ప్రకారం చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌, ఎంపిపిసిఎల్‌ ఎమ్‌డి అవినాష్‌ లావానియా, ఎఐడిఎ డిజి అలోక్‌ కుమార్‌, కేంద్ర ఇంధనశాఖ సంచాలకులు ప్రణవ్‌ తయల్‌, పవర్‌ ఫైనాన్స్‌ కొర్పొరేషన్‌ ఇడి అలీషా, ఎపి ట్రాన్స్‌కో జెఎమ్‌డి కీర్తి చేకూరి, ఎపిసిపిడిసిఎల్‌ సిఎమ్‌డి ఎకెవి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️