ఇండియా ఫోరం కొనసాగాలి

  • ఇండియా టుడే-సి ఓటర్‌ సర్వేలో వెల్లడి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు వివిధ రాజకీయ పార్టీలతో జతకట్టిన ‘ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయన్స్‌ (ఇండియా)’ ఫోరం ఇక ముందు కూడా కొనసాగాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇండియా టుడే – సి ఓటర్‌ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 2024లో ఎన్‌డిఎకు వ్యతిరేకంగా బరిలోకి దిగిన ‘ఇండియా’ పార్టీలు బిజెపికి ముచ్చెమటలు పట్టించిన సంగతి విదితమే. ఈ ఫోరం ప్రభావంతో బిజెపి సీట్లు తగ్గిపోవడంతో పాటు కేంద్రంలో మనుగడ సాగించాలంటే జెడియు, టిడిపి వంటి భాగస్వామ్యపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ప్రజలు ప్రజా వ్యతిరేక మోడీ సర్కార్‌ గద్దె దిగాలంటే ‘ఇండియా’ ఫోరం కొనసాగాల్సిందేనని ఆకాంక్షించారు. భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి, ఎన్‌డిఎను నిలువరించడానికి ‘ఇండియా’ కలిసి కట్టుగా పనిచేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో అనుకున్న ఫలితం రాకపోవడంతో ఆ తరువాత ఇండియా బ్లాక్‌లోని పార్టీలన్నీ ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా ఎవరికి వారే అన్నట్లు పోటీ చేయడంతో బిజెపి లాభపడుతూవచ్చింది. దీంతో ‘ఇండియా’ మనుగడపైనే నీలి నీడలు కమ్ముకున్న నేపథ్యంలో దేశ ప్రజలు దాని మనుగడ చాలా అవసరమని పేర్కొనడం గమనార్హం. ఇండియా టుడే – సి ఓటర్‌ తమ సర్వేలో భాగంగా ఈ ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 వరకు 1,25,123 మంది ఓటర్లను కలిసి అభిప్రాయాలు స్వీకరించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ‘ఇండియా’గా కొనసాగాలని సూచించారు. కేవలం 26 శాతం మంది ఆ బ్లాక్‌ అనవసరమని పేర్కొన్నారు. అలాగే ‘ఇండియా’ ఫోరానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు రాహుల్‌ గాంధీ నాయకత్వం వహించాలని 24 శాతం మంది కోరారు. ఆ తర్వాత స్థానంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘ఇండియా’కు నాయకత్వం వహిస్తే బావుంటుందని 14 శాతం మంది పేర్కొన్నారు. ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రివాల్‌ (9 శాతం), సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ (6 శాతం) తదుపరి స్థానాల్లో నిలిచారు.

➡️