డీలిమిటేషన్‌పై పోరుకు కర్ణాటక ప్రభుత్వ మద్దతు

  • 22 నాటి సమావేశంపై అధిష్టానంతో చర్చిస్తామని వెల్లడి

బెంగళూరు : దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లే రీతిలో జరగనున్న పునర్విభజన ప్రక్రియ (డీలిమిటేషన్‌) అంశాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ చేస్తున్న పోరాటానికి కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మద్దతు తెలియచేసింది. అయితే దీనిపై 22న స్టాలిన్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతున్నారా లేదా అనేది వెల్లడించలేదు. బుధవారం తనను కలిసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి, రాజ్య సభ సభ్యుడు ఎం.ఎం.అబ్దుల్లాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయం తెలియచేశారు. ఈ అంశంపై చేసే నిరసనలు, ఆందోళనలకు సిద్ధరామయ్య మద్దతు కావాలని తమిళనాడు ప్రతినిధి బృందం కోరింది. ప్రతినిధి బృందం సిద్ధరామయ్యను కలవడానికి ముందుగానే స్టాలిన్‌, సిద్ధరామయ్యకు ఫోన్‌ చేసి ఈ విషయాన్ని చర్చించారు. కర్ణాటక ప్రయోజనాలను దెబ్బ తీసే లేదా రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య సిద్ధాంతాలకు విఘాతం కలిగించేందుకు కేంద్రం చేపట్టే ఏ ప్రయత్నాలనైనా ఖండించి తీరుతామని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఈ అంశాలపై తాము మద్దతునివ్వడానికి సిద్ధమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)లో చేరాల్సిందిగా కోరుతూ స్టాలిన్‌, సిద్ధరామయ్యకు ఒక లేఖ రాశారు. ఈ అంశంపై ఐక్య వ్యూహాన్ని రూపొందించడంలో సాయమందించేందుకు కాంగ్రెస్‌నుండి ఒక సీనియర్‌ ప్రతినిధి వుండాలని ఆయన కోరారు. రాజకీయాలకు అతీతంగా సమిష్టి ప్రయోజనాల కోసం మనందరం కలిసి పనిచేయాలన్నారు. ఇదిలావుండగా, డిప్యూటీ ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ విలేకర్లరతో మాట్లాడుతూ, 22నాటి సమావేశంలో పాల్గొనాలా లేదా అనే అంశంపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నట్లు తెలిపారు.

➡️