సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
కొల్లాం : కేరళలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగాలని దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులు, వామపక్ష శ్రేణులు విప్లవాభినందనలు తెలియజేస్తున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సిపిఎం కేరళ రాష్ట్ర మహాసభలకు హాజరైన ఆయన తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. ‘కేరళలో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం దేశంలో కమ్యూనిస్టుల కోటగా ఇప్పటికీ నిలిచివుంది. నిలదొక్కుకోవడానికి, బలోపేతం కావడానికి ఇది పరీక్షా సమయం. కమ్యూనిస్టులు ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి, అభివృద్ధి చెందడానికి స్ఫూర్తి ప్రదాతగా కేరళ ఉంది. ఇది మంచి పరిణామం. కేరళ ప్రజలు దేశానికి ఈ సందేశాన్ని ఇవ్వాలి. ఆర్‌ఎస్‌ఎస్, మతతత్వ శక్తులతోపాటు మైనారిటీ మతతత్వ శక్తులు కేరళ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. కేరళ ప్రజలు సెక్యులర్ వ్యవస్థను, ప్రజాస్వామ్య విలువలను ఆదరించి, కాపాడుకోవాలి. జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న మతతత్వ శక్తులు వామపక్ష శక్తులను ఓడించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వామపక్షాలు, కమ్యూనిస్టులు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న సిపిఎం శ్రేణులు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. కేరళ ప్రజల పక్షాన నిలవాలి. రక్షణగా ఉండాలి. వామపక్ష ప్రభుత్వ పాలనను కొనసాగించేందుకు అండగా నిలవాలి’ అని అన్నారు.
