మధ్యతరగతి కునారిల్లుతోంది!

Oct 28,2024 07:09 #Hike Prices

ఎదుగూ బొదుగూ లేని ఆదాయం, వినియోగం
న్యూఢిల్లీ : గత కొంతకాలంగా మధ్యతరగతి ప్రజలలో ఆదాయం, వినియోగం… ఈ రెండూ ఎదుగూబొదుగూ లేకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా స్థిరంగా ఉంటున్నాయని నెస్లే ఇండియా సిఎండి సురేష్‌ నారాయణన్‌ చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో కంపెనీ అమ్మకాల్లో వృద్ధి బాగా పడిపోయిందని ఆయన తెలిపారు. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న తమ వంటి వినియోగ వస్తువుల పరిశ్రమలన్నీ మధ్యతరగతి ప్రజలపైనే ఆధారపడ్డాయని, అయితే ఇప్పుడు ఆ తరగతి కుంచించుకుపోతోందని అన్నారు. కంపెనీ త్రైమాసిక వృద్ధి గణాంకాలను విడుదల చేస్తూ సురేష్‌ నారాయణన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అనేక త్రైమాసికాలుగా ఈ మాంద్యం కొనసాగుతూనే ఉన్నదని, ఇది అసాధారణమని ఆయన చెప్పారు.ఏషియన్‌ పెయింట్స్‌ సిఇఒ అమిత్‌ సింగ్లే మేలో విశ్లేషకులు, మదుపుదారులతో మాట్లాడుతూ జిడిపి గణాంకాలపై సందేహాలు వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో వివిధ రంగాల పనితీరును అవి ప్రతిబింబించడం లేదని తెలిపారు. అయితే ఆ మరునాడే కంపెనీ ఒక ప్రకటన చేస్తూ తమ సిఇఒ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చింది. ఏదేమైనా కొంతకాలంగా చాలా మంది సీనియర్‌ కార్పొరేట్‌, మార్కెట్‌ విశ్లేషకులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగ వృద్ధిపై వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పండుగల సీజన్‌ వచ్చిందంటే నూతన వాహనాల కొనుగోలుపై ప్రజలు బాగా ఆసక్తి చూపుతుంటారు. అయితే దసరా వెళ్లి, దీపావళి వస్తున్నా మధ్యతరగతి జీవులు పెద్దగా వాటి కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశంలో వాణిజ్య వాహనాల అమ్మకాలు 4-6 శాతం తగ్గాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు కొంత మేర పెరిగినప్పటికీ 2018 స్థాయికి చేరలేదు. అధికారులు మాత్రం దీనికి వింత భాష్యం చెబుతున్నారు. మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరుగుతోందని, ద్విచక్ర వాహనాలు కాకుండా నేరుగా ఎస్‌యూవీలనే కొంటున్నారని వారు అంటున్నారు. ఈ వాదనను మారుతి ఉద్యోగ్‌ లిమిటెడ్‌ చైర్మెన్‌ ఆర్‌సీ భార్గవ తోసిపుచ్చారు. ఎస్‌యువి అమ్మకాలు పెరుగుతున్న మాట నిజమేనని, అయితే సంపన్నులే వాటిని ఎక్కువగా కొంటున్నారని, మధ్యతరగతి వారు ఇప్పటికీ ఆదాయం పెరగక ఇబ్బంది పడుతూనే ఉన్నారని ఆయన చెప్పారు.
గత దశాబ్ద కాలంగా గ్రామీణ ప్రజల ఆదాయం, వినియోగం స్థిరంగానే ఉంటున్నాయి. జిడిపి వృద్ధి 7 శాతం దాటుతుందన్న అంచనాలు ఉన్నప్పటికీ కొన్ని నెలలుగా పట్టణ వినియోగంపై ఒత్తిడి పెరుగుతోంది. సుమారు దశాబ్ద కాలంగా వార్షిక వినియోగ వృద్ధి 3.5 శాతంగానే ఉంటోందని, ఇది జిడిపి వృద్ధిలో సగమని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే చెబుతోంది. ఆదాయం, వినియోగం మాదిరిగానే గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు కూడా తగ్గిపోతోంది.

➡️