న్యూఢిల్లీ : గర్భిణీ పథకాన్ని మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ఎంపి సోనియాగాంధీ మండిపడ్డారు. ఈ పథకానికి నిధుల కొరత తీవ్రంగా ఉందని ధ్వజమెత్తారు. ఈ పథకం గురించి బుధవారం ఆమె రాజ్యసభలో మాట్లాడారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద గర్భిణుల ప్రయోజనం కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం అమలుకు రూ.12,000 కోట్లు అవసరమని, కానీ బడ్జెట్‌లో కేంద్రం కేవలం రూ. 2,500 కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు.
బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి రూ.6,000 ప్రసూతి ప్రయోజనాలు అందుతాయని, రెండు విడతలుగా చెల్లిస్తారని అన్నారు. రెండోసారి ఆడపిల్ల అయినా ఈపథకం వర్తిస్తుందని అన్నారు. 2022-23లో మొత్తం గర్భిణీలలో 68 శాతం మందికి ఒక విడత నిధులు అందాయని, కానీ ఆ తర్వాత ఆ నిష్పత్తి పడిపోయిందని అన్నారు. మరుసటి ఏడాది ఈ నిష్పత్తి 12 శాతానికి ఎందుకు పడిపోయిందని కేంద్రాన్ని నిలదీశారు.
