హర్యానాలో క్షణక్షణం ఉత్కంఠ – జమ్మూకాశ్మీర్‌లో ఒకసైడే ఆటంతా ..!

శ్రీనగర్‌ : నేడు హర్యానా, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోన్న వేళ … హర్యానా రాష్ట్రంలోని ఫలితాల సరళి క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతోంది. కౌంటింగ్‌ ప్రారంభంలో కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోయినా, ఆ తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది. దీంతో రెండు జాతీయ పార్టీల మధ్య హోరా హోరీ మొదలయ్యింది. రాజకీయ నాయకులు టెన్షన్‌.. టెన్షన్‌.. గా ఉన్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌ లో వార్‌ వన్‌ సైడ్‌ అన్నట్లుగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమి ఆధిక్యంతో ముందంజలో ఉంది. నేటి ఉదయం 10 గంటల వరకు నమోదైన ఫలితాల సరళిని చూస్తే … హర్యానా రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం కాగా, ప్రస్తుతం అక్కడ బీజేపీ 45 స్థానాల్లో ముందంజలో ఉండగా మరోవైపు కాంగ్రెస్‌ ఆధిక్యం 38కి పడిపోయింది. అలాగే ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇందులో ఐఎన్‌ఎల్‌డీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ అక్కడ ఖాతా తెరవలేదు. ఇదిలా ఉండగా… జమ్మూ కాశ్మీర్‌ లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ దూసుకెళుతోంది. ఆ పార్టీ ప్రస్తుతం 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 23, పీడీపీ 3, కాంగ్రెస్‌ 9 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అలాగే ఇతరులు ఏకంగా 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ, పీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి. జమ్మూలో కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ లో పొత్తులో ఉన్న విషయం విదితమే.

➡️